అర్హులెవరూ ఆందోళన చెందవద్ద
విడతల వారీగా లబ్ధిదారుల ఎంపిక
గ్రామాల్లో సర్వే తీరును పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ ప్రతినిధి/రామాయంపేట[RAMAYAMPET], జనవరి 16 సిరి న్యూస్ః
జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఇండ్లుకు లబ్ధిదారుల ఎంపిక వంటి నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాల అమలుకు సర్వే ప్రారంభం అయినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంతో పాటు మండల పరిధిలో కాట్రియాల గ్రామంలో సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సర్వే తీరును పరిశీలిస్తూ, ఇంట్లో సభ్యులతో మాట్లాడారు. ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఏం జీవనం సాగిస్తారు? పొలం ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? వంటి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి నిరుపేదకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే దిశగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందన్నారు.లబ్ధిదారుల ముసాయిదా జాబితా తయారీకి నిరుపేదల గుర్తింపుకు సర్వే ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగు పథకాల అమలుకు జిల్లాలో సర్వే ప్రక్రియ ప్రారంభమైందని, ఈ సర్వేలో భాగంగా పర్యవేక్షణకు అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించి విచారణా బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలను సేకరిస్తున్నాయని ఆయన వివరించారు.
సర్వే నిర్వహణ ద్వారా పథకాల అమలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. సర్వే నిర్వహణకు ప్రజలు సహకరించాలని కోరుతూ ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పథకాల లబ్ధి ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవడం జిల్లా యంత్రంగం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సర్వేలో ఏమైనా సమస్యలుంటే కారణాలను వ్రాయాలని సూచించారు. ఈ నెల 16 నుండి 20వ తేది వరకు సర్వే జరుగుతుందని, 21 నుండి 24వ తేది వరకు గ్రామసభలు నిర్వహించి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. కాకపోతే విడతల వారీగా లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందన్నారు. అర్హులెవరూ కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట రామాయంపేట ప్రత్యేక అధికారి ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, తాసిల్దార్ రజనితో పాటు మండల, గ్రామాల, ఎంపీఓలు, ఆర్ఐలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.