నూతన రిజర్వాయర్లతో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు

Safe drinking water for every household with new reservoirs
Safe drinking water for every household with new reservoirs

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం
జనవరి 20వ తేదీ లోపు నూతన రిజర్వాయర్ల ద్వారా నీటి పంపిణీ ప్రారంభం..
శరవేగంగా పెండింగ్ పనులు పూర్తి చేయండి..
వచ్చే వేసవికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయండి..
తెల్లాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిధిలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక

పటాన్చెరు
ఈనెల 20వ తేదీ లోపు బొల్లారం, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నిర్మించిన నూతన రిజర్వాయర్ల ద్వారా మంచినీటి సరఫరా ప్రారంభించినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. జలమండలి అధికారులు, మున్సిపల్ చైర్మన్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పటాన్చెరు నియోజకవర్గంలోని ఓఆర్ఆర్ పరిధిలోగల మున్సిపాలిటీలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు పైప్ లైన్లు వేయడం జరుగుతుందని తెలిపారు. ప్రధానంగా బొల్లారం మున్సిపల్ పరిధిలో రెండు మిలియన్ లీటర్ల సామర్థం గల రెండు రిజర్వాయర్లు, పంప్ హౌస్ పనులు పూర్తయ్యాయని, త్వరలో మంచినీటి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ, లాలాబావి కాలనీ, బంధం కొమ్ము లలో మూడు రిజర్వాయర్లు పూర్తయ్యాయని.. 20వ తేదీ లోపు మంచినీటి సరఫరా ప్రారంభిస్తామని తెలిపారు.బొల్లారం పారిశ్రామికవాడలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టడం జరిగిందని తెలిపారు.
ఓ ఆర్ ఆర్ అవతల బొల్లారం మున్సిపల్ పరిధిలోని నూతన గృహాలకు, అపార్ట్మెంట్లకు సైతం మంచినీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపల్ పరిధిలో అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు మున్సిపాలిటీల నుండి ఐదు కోట్ల 40 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు.తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో కొల్లూరు, ఉస్మాన్ నగర్ లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఇప్పటికే 15,000 మంది లబ్ధిదారులు నివసిస్తున్నారని, ఇందుకు అనుగుణంగా సమస్యలు లేకుండా మంచినీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. నూతన రిజర్వాయర్ల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.రాబోయే వేసవిలో మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నీటి ఎద్దడి పేరుతో ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జలమండలి డైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ శ్రీధర్, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, జలమండలి జనరల్ మేనేజర్ సుబ్బారాయుడు, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, డీజీఎంలు చంద్రశేఖర్, శివ, సోమిరెడ్డి, బాల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, కౌన్సిలర్లు మహదేవరెడ్డి, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.