మర్డర్ కేసును చేదించిన పోలీసులు

నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు త‌ర‌లింపు

శివంపేట్ ఫిబ్రవరి 5 ( సిరి న్యూస్ ) : శివంపేట మండలంలోని తిక్కదేవమ్మగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సామ్య తండాలో ఫిబ్రవరి 2న మాలోతు మదన్ లాల్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటనపై మృతుడి చెల్లెలు సరిత పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్‌ స్క్వాడ్, టవర్ డాటా కాల్ రికార్డుల ద్వారా వివరాలు విశ్లేషించి, ఫిబ్రవరి 5 సాయంత్రం నిందితులను పోలీసులు గుర్తించారు.

దర్యాప్తులో నిందితులు ఇద్దరుగా తేలారు. నిందితుడు A1 మాలోత్ భారత్ సేన్ (24) లింగాయిపల్లి తండా, దౌల్తాబాద్ మండలానికి చెందిన డ్రైవర్ కాగా, అతనితో పాటు A2 మ్యాకల్ నవీన్ (29) నర్సింగి మండలానికి చెందిన వ్యక్తి ఉన్నాడు. పోలీసులు వీరిని తూప్రాన్ టౌన్ శివారులో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భరత్ సేన్ మృతుడు మదన్ లాల్ సొంత అన్న తారా సింగ్ కుమారుడు అని, గతంలో భూమి వివాదాల నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య కలహాలు ఉన్నట్లు గుర్తించారు.

2016లో తారా సింగ్ ప్రమాదవశాత్తు మృతిచెందగా, అందుకు మదన్ లాల్ కారణమని భావించిన భరత్ సేన్ అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు మ్యాకల్ నవీన్ సహాయంతో ఫిబ్రవరి 1న తూప్రాన్ నుండి సామ్య తండాకు వెళ్లి మదన్ లాల్ ఇంటికి చేరుకున్నారు. మాటలతో నమ్మించి బయటకు రప్పించి, అతి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు.

భరత్ సేన్ తొలుత మదన్ లాల్ వీపు భాగంలో నలుగురు కోపంగా పొడవగా, నవీన్ అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. అనంతరం భరత్ అతని మీద కాలు పెట్టి మరింత గాయపరిచి ప్రాణాలు తీసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసును డిఎస్పీ వెంకట్ రెడ్డీ, తూప్రాన్ సీఐ రంగకృష్ణ, శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పూర్తిగా విచారించి నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్ని రిమాండ్‌కు తరలించారు. హత్యకు గల ప్రధాన కారణంగా కుటుంబ విభేదాలు, భూమి వివాదాలు అని పోలీసులు స్పష్టం చేశారు.