గ్రామసభల్లో అధికారులపై తిరగబడ్డ నిరుపేదలు…
తాసిల్దార్, ఎంపీడీవో, ఎస్ఐల హామీతో శాంతించిన ప్రజలు…
మనోహరాబాద్,[Manoharabad]
జనవరి 21. సిరి న్యూస్.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే నాలుగు రకాల సంక్షేమ పథకాల మంజూరులో స్థానిక అదికారులు చేపట్టిన సర్వేలలో భాగంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అంతా బోగస్ అని పలు గ్రామాల ప్రజలు ఆందోళన చేపడుతూ అధికారులపై తిరగబడ్డారు. ఇది తెలుసుకున్న తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్సై సుభాష్ గౌడ్ లు గ్రామానికి చేరుకొని ప్రజలకు నచ్చజెప్పి శాంతింప చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి పి. టి గ్రామంలో చోటుచేసుకుంది. ప్రభుత్వం మంజూరు చేసే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డుల మంజూరులో నిర్వహించిన సర్వేలో భాగంగా మంగళవారం మండలంలోని కోనాయిపల్లి పి. టి, కొండాపూర్, దండుపల్లి, ముప్పిరెడ్డిపల్లి, జీడిపల్లి, పరికి బండ, లింగారెడ్డిపేట, వెంకటాపూర్ అగ్రహారం గ్రామాలలో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ తరుణంలో కోనాయిపల్లి పి. టి గ్రామంలో అధికారులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పై లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించారు. ఈ రెండు పథకాలలో నిజమైన అర్హులైన నిరుపేదల పేర్లు రాలేవని, ఇండ్లు ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు లిస్టు, తల్లిదండ్రులకు భూములు ఉన్న వారి కుమారులు, కోడండ్లు ఉపాధి హామీలో జాబ్ కార్డ్లు కలిగి ఉన్నవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లిస్టు లో పేరు వచ్చిందని, ఎలాంటి వ్యవసాయ భూములు లేకున్నా కూలీ పనులే చేసుకునే నిరుపేదల పేర్లు రాలేదని అధికారులపై తిరగబడ్డారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి సర్వే చేసిన అధికారులపై చర్యల కోసం ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్న తరుణంలో ఇది తెలుసుకున్న తాసిల్దార్, ఎంపీడీవో, ఎస్సై లో గ్రామానికి చేరుకొని ప్రజలను శాంతింపజేశారు. మళ్లీ రిసర్వే నిర్వహించి నిజమైన నిరుపేద అర్హుల ను గుర్తించి లిస్టు తయారు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరుపేదలు శాంతించారు. అలాగే కొండాపూర్ గ్రామంలో సైతం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో సైతం ఉన్నవారి పేర్లను లిస్టులో పొందుపరిచారని అధికారులపై మండిపడ్డారు. దండుపల్లి గ్రామంలో దాదాపు 200 మందికిపైగ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోగా కేవలం 12 మంది మాత్రమే మంజూరైనట్లు అధికారులు లిస్టులో పేర్లు చదవడంతో మిగతా లబ్ధిదారులు అధికారుల తీరుపై మండిపడ్డారు.