పుట్టగొడుగుల్లా ఇటుక బట్టీలు
అవినీతి నీడలో అధికారగణం
లక్షలు కొల్లగొడుతున్న అక్రమార్కులు
జనావాసాలు, వ్యవసాయ భూముల్లో బట్టీల ఏర్పాటు
అక్రమంగా విద్యుత్ వాడకం
బట్టీల్లో బందీ అవుతున్న చిన్నారులు
పర్యావరణ కాలుష్యాన్నిపెంచుతున్నా పట్టింపులేదు
గుమ్మడిదల [Gummadidala] రూరల్, జనవరి 15(సిరి న్యూస్)
అక్రమార్కులకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది..ధనార్జనే ధ్యేయంగా అక్రమ వ్యాపారాలకు తెరలేపుతున్నారు…అక్రమార్కులు దర్జాగా దందాలు కొనసాగిస్తుంటే..అవినీతికి అలవాటుపడ్డ అధికారులు మాత్రం నిద్రావస్థలో మగ్గుతున్నారు…చేయి తడిపితే చాలు అక్రమ దందాల వైపు కన్నెత్తి కూడా చూడరు…ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినా బుట్టదాఖలు చేస్తారు..బాల కార్మికులు అధికారులకు కనిపిస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు..అనుమతి లేకున్నా అమ్యామ్యాలు ముడితే చాలు అధికారుల ఆశీస్సులు మెండుగా ఉంటాయి…ఇదంతా గుమ్మడిదల మండలంలో నిత్యం జరుగుతున్న తంతు..అనుమతులు లేకుండా అక్రమంగా ఇటుక బట్టీలను నడిపిస్తున్నా…విచ్చలవిడిగా వాయి కాలుష్యాన్ని పెంచుతున్నా అధికారులు నిద్రావస్థలో మగ్గుతున్నారు…అక్రమ ఇటుక బట్టీల వ్యవహారంపై సిరి దినపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం…
గుమ్మడిదల మండలంలో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రెవెన్యూ, మైనింగ్, కార్మిక, విద్యుత్ శాఖ అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలోని అన్నారం, దోమడుగు, బొంతపల్లి గ్రామాలలో ఇటుక బట్టీలను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు. సుమారుగా 50 కి పైగా ఇటుక బట్టీలు ఉన్నాయి.
అనుమతి అవసరం లేదా ?
ఇటుక బట్టీలు ఏర్పాటు చేయాలంటే ముందుగా గ్రామ పంచాయతీ, మైనింగ్, రెవెన్యూ , కార్మిక శాఖ, విద్యుత్ శాఖ నుండి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. ఇటుక బట్టిలను పంట పొలాల్లో ఏర్పాటు చేయడమే కాకుండా స్థానికంగా ఉండే వనరులను కొల్లగొడుతున్నారు. ఏళ్ల తరబడి వ్యాపారాలు కొనసాగుతున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అనుమతులతో కూడిన ఇటుక బట్టీలను గ్రామాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా అవేమీ పట్టడం లేదు. ప్రధానంగా ఎలాంటి అనుమతులు లేకుండా చాలా వరకు అక్రమ బట్టీలను పెట్టి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
వ్యవసాయ భూముల్లో ఇటుక బట్టీలు…
వ్యవసాయ భూములలో ఎక్కువగా ఇటుక బట్టిలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ భూములకు నాలా అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకొని బట్టీలను సీజ్ చేసే అధికారం రెవెన్యూ అధికారులు ఉన్నా చర్యలు చేపట్టడం లేదు. గ్రామస్థాయిలో బహిరంగంగా వ్యాపారాలు కొనసాగిస్తున్నా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పంట భూముల్లో ఉన్న బోర్లను సైతం వ్యాపారానికి అనుగుణంగా వాడుకుంటున్నారు.
బాల కార్మికులతో పని…
బాల కార్మిక చట్టాన్ని తుంగలో తొక్కి ఇటుక బట్టీలలో చిన్న పిల్లలతో సైతం పనులు చేయిస్తున్నారు. పాఠశాలల్లో చదువుకునే వయసు పిల్లలను పనులకు పెట్టుకొని వారితో పనులు చేపిస్తున్నారు. బడి ఈడు పిల్లలు పనులు చేస్తున్నా కార్మిక శాఖ అధికారులు కానీ విద్యాశాఖ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
బట్టీలకు అక్రమ విద్యుత్…
వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్‌ను ఇటుక బట్టీల వ్యాపారానికి వాడుకుంటున్నా విద్యుత్ అధికారులు స్పందించకపోవడం ఆశ్చర్యంగా మారింది. రాత్రి సమయంలో ఇష్టానుసారంగా కరెంటు వాడుతున్న వారిపై ఎలాంటి చర్యలు మాత్రం తీసుకున్న దాఖలాలు ఈ ప్రాంతంలో ఎక్కడా లేవని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. అనుమతులు లేకుండా గ్రామస్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇటుక బట్టీలను తొలగించాలని, అనుమతి ఉన్న బట్టీలకు గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేయించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.