ప‌థ‌కాల‌కు కోత‌లు…రైతుల‌కు వాత‌లు – సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్‌రావు ఆగ్ర‌హం

ష‌ర‌తుల పేరిట అన్న‌దాత‌కు అవ‌మానం
ఇదీ రేవంత్ స‌ర్కార్ ఏడాది పాల‌న‌కు నిద‌ర్శ‌నం
ఆదాయం కంటే క్రైం రేట్ పెంచారు
ప్ర‌భుత్వంలో ఉద్యోగుల‌కు భ‌ద్ర‌త క‌రువైంది..

సంగారెడ్డి ప్ర‌తినిధి, జ‌న‌వ‌రి 1(సిరిన్యూస్‌): తెలంగాణలో రైతుల బ‌తుకులు ఆగ‌మ‌య్యాయి…వారికి ఇచ్చే పథకాలు అన్నింటిలోనూ కోతలుపెడుతూ రేవంత్ సర్కార్ రైతులకు వాత‌లు పెడుతున్నార‌ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా కోసం రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పడం రైతులను అవమాన పరిచినట్లేనని అన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతులకు షరతులు పెట్టడం సరికాదన్నారు. వానకాలం యాసంగి కి కలిపి రైతులకు 15000 ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. పత్తి సాగు చేసే రైతులకు పెట్టుబడి సాయం ఒకేసారి ఇస్తామని ప్రభుత్వం లీకులు ఇస్తుందన్నారు. పసుపు, అల్లం, చెరుకు రైతులకు ఒకసారి మాత్రమే రైతు భరోసాను ఇస్తామనడం వారి కడుపు కొట్టాడమేనని వాపోయారు. వ్యవసాయ కూలీలకు ప్రతినెల 28న 12వేలు ఇస్తామని చెప్పి ఆ మాట తప్పారన్నారు. రైతు కూలీలకు ఇచ్చే ఉపాధి హామీ డబ్బులను కూడా వారికి ఇవ్వకుండా దారి మరల్చారని విమర్శించారు.

క్రైం రేట్ పెంచిన స‌ర్కార్‌…

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగి దక్షిణ భారతంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండటం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గత బీఆర్ఎస్ హయాంలో పోలీసు వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండి శాంతిభద్రతలు అదుపులో ఉండేవని గుర్తు చేశారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ హోంశాఖను కూడా తన దగ్గరే పెట్టుకుని పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. నేషనల్ క్రైమ్ బ్యూరో జరిపిన సర్వేలో తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగి ప్రస్తుతం ఎల్లో జోన్ లో ఉండడం ఘోరమన్నారు. రాబోయే రోజుల్లో రెడ్ జోన్ లోకి పోయి పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించే ప్రమాదం ఉందని అన్నారు. ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో పెట్టుబడులు రాక తెలంగాణ ఆగమై పోయే ప్రమాదం పొంచి ఉందన్నారు.

ఉద్యోగ భ‌ద్ర‌త‌లో ఫెయిల్‌…

ఉద్యోగులకు అందించే ఆరోగ్య భద్రత కల్పించడంలోనూ రాష్ట్ర సర్కార్ ఫెయిల్ అయిందని హరీష్ రావు అన్నారు. తమకు న్యాయంగా రావాల్సిన డిమాండ్లను కోరితే రాష్ట్రంలో 36 మంది పోలీసులను సస్పెండ్ చేశారని అన్నారు. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపోతే సంగారెడ్డి జిల్లాలో కూడా గత సంవత్సరం కంటే ఈ ఏడాది క్రైమ్ రేటు అధికంగా పెరిగిపోవడం చూస్తుంటే ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ మొండి వైఖరిని మానుకొని రైతులకు అందించే రైతు భరోసా, ఉపాధి హామీ డబ్బులలో కోతలు విధించకుండా వారికి ఇవ్వాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ మాణిక్యం, బీఆర్ఎస్ నాయకులు విజయేందర్ రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.