ఏడాది కాలంగా ఎదురుచూపులు.. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి
సరైన స్పష్టత ఇవ్వలేకపోతున్న విద్యుత్ శాఖ అధికారులు..
ఇప్పటికైనా నిరంతర ప్రక్రియ సాగాలని కోరుతున్న ప్రజలు
రామాయంపేట [Ramayampet]జనవరి 20 (సిరి న్యూస్)
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ చాలావరకు లబ్ధిదారులకు అందడం లేదు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గృహ జ్యోతి పథకంలో భాగంగా అర్హులకు 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్ ప్రకటించిన విషయం తెలిసింది. అయితే చాలావరకు రామాయంపేట ఉమ్మడి మండలంలో అర్హులైన వారికి ఇప్పటికీ ఈ పథకం వర్తించకపోవడం గమనార్హం. తాము అన్ని విధాలుగా అర్హులు అయినప్పటికీ ఈ పథకం వర్తించకపోవడం పట్ల లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో విద్యుత్ శాఖ అధికారులతో పాటు మండల పరిషత్, మున్సిపల్ అధికారులను అడిగితే సరైన స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం నుండి స్పష్టమైన వైఖరి వస్తే తాము అమలు చేస్తామని నిమ్మకు నీరు ఎత్తినట్లు తూతూ మంత్రంగా సమాధానాలు చెప్పి దాటవేయడం జరుగుతుంది. అయితే చాలావరకు గ్రామాల్లో ఇరుగుపొరుగు వారికి గృహ జ్యోతి పథకం వర్తించి తమకు వర్తించకపోవడం పట్ల మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాలో ఉన్న వారికి ఈ పథకం వర్తించి పూరి గుడిసెలు లేదా రేకుల షెడ్డులో ఉన్నవారికి ఈ పథకం వర్తించకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పథకం వర్తించకపోవడం వల్ల విద్యుత్ అధికారులు ముక్కు పిండి మరి బిల్లులు వసూలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసేది మరొకటి అనే విధంగా అంగు ఆర్భాటాలు తప్ప అర్హులైన వారికి పథకం వర్తింపజేసే విధంగా ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదని అర్హుల నుండి బలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మరోసారి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలు జనవరి నెలలో అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసింది. ఇందులోనే గురజాతి కూడా తక్షణమే అమలు చేస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.