అశేష జనవాహిని మధ్య మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు
కాళ్లకల్ శివారులో మైనంపల్లికి గజమాలతో సత్కరించిన మహిపాల్ రెడ్డి
బంగారమ్మ దేవాలయంలో ఘనంగా పూజలు
45 కిలోల కేకు కట్ చేసిన మైనంపల్లి హనుమంతరావు
మనోహరాబాద్, జనవరి 8(సిరిన్యూస్) : మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumantha Rao) ఆ పేరు వింటేనే కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిపోతుంది. హన్మంతన్న అంటూ పిలుచుకునే వ్యక్తి జన్మదిన సంబరాలంటే అభిమానులకు, కార్యకర్తలకు పండగ వాతావరణమే. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హన్మంతరావు జన్మదినాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ జాతీయ రహదారిపై మాజీ సర్పంచుల ఫోరమ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిటుకుల మహిపాల్ రెడ్డి నేతృత్వంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిపాల్‌రెడ్డితో పాటు మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఉమ్మడి మండల సొసైటీ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మైనంపల్లి హనుమంతరావుకు ఘన స్వాగతం పలికి క్రేను సహాయంతో భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం మైపాల్ రెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించిన మైనంపల్లి పేర పాటల సీడీని హనుమంతరావు ఆవిష్కరించారు. అక్కడినుండి జాతీయ రహదారి పొడవునా బంగారమ్మ దేవాలయం వరకు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. బంగారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి మండల కేంద్రమైన మనోహరాబాద్ వరకు ర్యాలీ కొనసాగింది. మనోహరాబాద్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజీపై 45 కిలోల కేకును హనుమంతరావు కట్ చేసి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు కేకులు పంచుకున్నారు. ఈ సందర్భంగా హన్మంతరావు మాట్లాడుతుంటే ప్రజల ఆదరాభిమానాలు నాకెంతో ఉల్లాసానిచ్చాయని పేర్కొన్నారు. ఎల్లవేళలా కార్యకర్తలకు , నాయకులకు, అభిమానులకు అండగా ఉంటానని తెలిపారు.
పిలిస్తే పలికే నేత…
రాష్ట్ర నాయకులు చిట్కుల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మైనంపల్లి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎందరో పేదలకు సహాయ సహకారాలు అందించడం జరిగిందని, తాగునీటి సమస్య తీర్చడానికి సొంత డబ్బులతో బోర్లను వేయించడం జరిగిందన్నారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు, పార్టీకి హన్మంతరావు ఒక పెద్ద దిక్కుగా నిలుస్తున్నారని కొనియాడారు. ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా తానున్నానంటూ పలికే హన్మంతరావు జన్మదిన వేడుకలు కార్యకర్తల నడుమ జరుపుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా హన్మంతరావుకు అయ్యప్ప స్వామి చిత్రపటాన్ని బహుకరించారు. హనుమంతరావు వెంట మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి లతోపాటు ఈ జన్మ దిన వేడుకలలో మనోహరాబాద్ మండలం, మెదక్, తూప్రాన్, గజ్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.