జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
జనవరి 26 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
భారత గణతంత్ర దినోత్సవాన్ని
పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. ఉత్తమ సేవలుఉద్యోగులకు, సీఎంకు క్రీడ పోటీలలో పథకాలు సాధించిన క్రీడాకారులకు, ప్రశంసా పత్రాలు అందించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర, టి జి ఐ ఐ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా ఎస్పీ రూపేష్.అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ ,మాధురి, డిఆర్ఓ పద్మజారాణి , అదనపు ఎస్పి సంజీవరావు,ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పుర ప్రముఖులను కలెక్టర్ కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు బహూకరించారు.పోలీస్ శాఖ,వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ, డెయిరీ, పశువైద్య, మహిళా శిశు సంక్షేమం, నీటి పారుదల, ఫిషరీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించారు. అంతకుముందు ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును చాటుతూ వివిధ శాఖలు ప్రదర్శించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందిరమ్మ ఇళ్లు నమూనాతో కూడిన హౌసింగ్ శకటం ప్రజలను ఆకట్టుకుంది.
ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశభక్తి భావాన్ని నింపుకుని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెలద్దారు. ప్రభుత్వ పాఠశాలల బాలబాలికలు చూడచక్కని నృత్య రీతులను అలవోకగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించారు. బాలబాలికలు ఏకరూప దుస్తులు ధరించి తమ అభినయంతో అలరింపజేశారు.ఎదనిండా దేశ భక్తిని నింపుకుని, జాతీయ సమైక్యతా భావం పెంపొందేలా దేశభక్తి గేయాలు ఆలపిస్తూ నృత్య ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా చిన్నారులను కలెక్టర్ తో పాటు ఇతర అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు వారి వద్దకు వెళ్లి మెమోంటోలు, ప్రశంసా పత్రాలను బహూకరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో, జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వల్లూరు మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు.