నిలిచిన విద్యుత్ సరఫరా..
వాడిపోతున్న పంటలు..
రెండు నెలలుగా అన్నదాతల అవస్థలు..
పట్టించుకోని అధికారులు..
ఝరాసంగం : ఝరాసంగం మండలంలోని బొప్పన్ పల్లి గ్రామ శివారులో 11 కేవీ విద్యుత్ స్తంభం పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి గత రెండు నెలలుగా ట్రాన్స్ ఫార్మర్ నిరుపయోగంగా మారింది. ట్రాన్స్ ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వ్యవసాయ విద్యుత్ బోర్ల మోటార్లు పనిచేయడం లేదు. ట్రాన్స్ఫారం కింద బోర్ల ద్వారా సాగు చేస్తున్న రైతుల పంటలు ఎండు ముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నేలకొరిగిన విద్యుత్ స్తంభాన్ని మరమ్మత్తులు చేసి విద్యుత్ సరఫరా చేయాలని రైతులు విద్యుత్ అధికారులను గత రెండు నెలలుగా మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని సంబంధిత రైతులు శుక్రవారం మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో ఆందోళన వ్యక్తం చేశారు.
మరోసారి తమ మొరను అధికారులకు చెప్పుదామని సబ్ స్టేషన్ కు వస్తే విద్యుత్ ఏఈ, లైన్మెన్ ఎవరూ కూడా అందుబాటు లేకపోవడంతో రైతులు ఆవేదన కనపరిచారు.గత రెండు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు స్పందించడం లేదని వారు వాపోయారు.సంబంధిత సిబ్బంది డిమాండ్ మేరకు పదివేల రూపాయలు ఇవ్వడానికి తాము అంగీకరించిన పనులు మాత్రం చేయడం లేదన్నారు.తమ పొలాల్లో పంటలు ఎండు ముఖం పట్టిన అధికారులు కనికరించడం లేదని విద్యుత్ అధికారుల పని తీరు వల్ల తాము నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి తమను ఆదుకోవాలని రైతులు రహీం,గఫార్, నిజాముద్దీన్ కోరారు.