– వర్తక, వ్యాపార సంస్థల బంద్ విజయవంతం
– రామాయంపేటలో బైపాస్ రోడ్డుకు స్వస్తి పలకండి
రామాయంపేట, జనవరి 7(సిరి న్యూస్): రామాయంపేట (Ramayampet) మండల కేంద్రంలో మంగళవారం వర్తక, వ్యాపార సంస్థలు స్వచ్ఛంద బంద్ (Bandh) నిర్వహించాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెదక్ టు ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రామాయంపేట మండలం పరిధిలో బైపాస్ రోడ్ నిర్మించే ప్రతిపాదనను వ్యాపారస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బైపాస్ రోడ్ నిర్మాణం వల్ల వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయని, రామాయంపేట అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. అంతే కాకుండా, గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామాయంపేట ప్రస్తుతం చిన్న మండలంగా మారి అభివృద్ధికి నోచుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బైపాస్ రోడ్ నిర్మాణం కాకుండా గతంలో ఉన్న రహదారినే విస్తరించి జాతీయ రహదారిగా కొనసాగించాలని, తద్వారా రామాయంపేట అభివృద్ధి చెందుతుందని వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు. బైపాస్ రోడ్ నిర్మాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. బంద్ సందర్భంగా ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా పోలీసులు ముందు చర్యలు చేపట్టారు. బంద్ విజయవంతం చేసినందుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.