నూతన సంవత్సరం..నూతన పనులకు స్వాగతం..
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని ఆశ..
రైతుభరోసా కోసం ఎదురుచూపులు..
పదవులు ఆశిస్తున్న నాయకులు..
అందరి చూపు సంక్రాంతి వైపు..
మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు గత సంవత్సరానికి వీడ్కోలు పలికి…కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. సంవత్సరం మొత్తం బాగుండాలని, అన్నీ కలిసి రావాలని మొదటిరోజున దేవాలయాలు, చర్చిలకు వెళ్ళి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేవారు. కోరికలు నెరవేరాలని మొక్కుకున్నారు. అలాగే ఈ ఏడాది ప్రభుత్వ హామీల్లో భాగమైన కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం అమలు కావాలని, వాటితో తమకు లబ్ది చేకూరాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. కొత్త సంవత్సరంలో మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పదవులు దక్కాలని, నామినేటెడ్ పదవులు అందాలని నాయకులు కోరుకుంటున్నారు.
పదవులు వరించాలని…
కొత్త సంవత్సరంలో జరిగే మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్న వారు పదవులు దక్కాలని కోరుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1615 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల పాలకవర్గం గడువు త్వరలో ముగియనుంది. అదే విధంగా ఎంపిటీసీలు, జడ్పీటీసీల ఎన్నికలతో పాటు ఎంపీపీలు, జిల్లా పరిషత్ పాలక మండలి ఎంపిక కూడా ఈ ఏడాదిలోనే జరుగుతుంది. వీటితో పాటు నామినేటెడ్ పదవులైన ఎమ్మెల్సీలు, ఇతర కార్పోరేషన్ చైర్మన్ల పదవుల కోసం జిల్లాల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ కలిసొచ్చి పదవులు వరించాలని ఆశిస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు…
ఇల్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా లబ్దిదారుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. ప్రజాపాలన కార్యక్రమంలో ఇల్లు కావాలని ఉమ్మడి జిల్లాలో లక్షలాదిగా దరఖాస్తులు వచ్చాయి. వాటితో పాటు ఆయా మున్సిపాలిటీలలో వేలాదిగా దరఖాస్తులు వచ్చాయి. అయితే నిజమైన లబ్దిదారుల ఎంపిక కోసం సర్వే సాగుతోంది. కొత్త సంవత్సరంలో కొత్త ఇల్లు భాగ్యం కలుగుతుందనే ఆశతో అర్హులైన లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు.
సాగు సాయం కోసం…
గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో వానాకాలం, యాసంగి పంటలకు ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు పంటలకు సంవత్సరానికి రూ..10వేలు పెట్టుబడి సాయం అందించేది. కానీ ఏడాదిగా రైతుబంధు (రైతు భరోసా) సాయం అందడం లేదు. అయితే ఈ పథకాన్ని కాస్త మార్పు చేసి పది ఎకరాలోపు రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో రైతులు సాగు చేసుకుంటున్నారు.
చేయూత కోసం ఎదురుచూపు…
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్దులు, దివ్యాంగులు, వితంతులు, నేత, గీత, బీడీ కార్మికులు తదితరులు ఆసరా పింఛన్ తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 3 – 3.5 లక్షల మంది పొందే పింఛన్ ఈ ఏడాది నుంచి ప్రస్తుతం ఇస్తున్న దివ్యాంగ పింఛన్ రూ.3016లకు గాను రూ.6వేలు, ఇతర పింఛన్ రూ.2016లకు గాను రూ.4వేలకు పెంచుతామని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పడంతో వాటికోసం ఎదురు చూస్తున్నారు.
రేషన్ కార్డులపై ఆశలు…
రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు. దీంతో సంవత్సరాల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారు కొత్త సంవత్సరంపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 5 లక్షలకు పైగా ఆహార భద్రత కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో కొత్తగా పెళ్ళి అయిన వారికి కార్డులు లేవు. అదే విధంగా పిల్లల పేర్లు నమోదు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు లక్షన్నరకు పైగా మంది కొత్త రేషన్ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. వీరందరూ ఈ ఏడాదిలో కొత్త రేషన్ కార్డులు రావాలని కోరుకుంటున్నారు.