చిన్నారి విద్యార్థులకు అక్షరాభ్యాసం..
గుమ్మడిదల: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పురోహితులు శంకర్ శర్మ చిన్నారులతో సరస్వతి పూజను చేయించారు. విద్యా దేవత సరస్వతి అమ్మవారిని విద్యార్థులు భక్తిశ్రద్ధలతో పూజించారు.
అనంతరం అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించి, విద్యార్థులకు జ్ఞానానికి ప్రాముఖ్యత వివరించారు. ఈ సందర్భంగా ఆర్.ఎస్.ఎస్ కార్యవాహ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు మార్గదర్శక సందేశాన్ని అందించారు. విద్య ప్రాధాన్యతను వివరించడంతో పాటు, విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైత్రి ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్ కుమార్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు, గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను మరింత వైభవంగా నిర్వహించారు.