హింసాత్మక ఘటనలను ఉపేక్షించేది లేదు – ఐజీ సత్యనారాయణ

– హైదరాబాద్ మల్టిజోన్ 2 ఐజీ సత్యనారాయణ
– పటాన్ చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఐజీ పర్యటన
– దాడికి పాల్పడిన 43 మందిని గుర్తించి కేసు నమోదు

పటాన్ చెరు, జనవరి 24 (సిరి news) : అప్రజాస్వామిక పద్దతిలో జరిగే ఏలాంటి హింసాత్మక సంఘటనలను ఉపేక్షించేది లేదని, అలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మల్టిజోన్ 2 ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో గత మూడు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పటాన్ చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఐజీ సత్యనారాయణ పర్యటన ప్రాదాన్యత సంతరించుకుంది. శుక్రవారం పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఐజీ గురువారం జరిగిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన దాడికి సంబంధించిన వివరాలను సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్, పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి లను అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన 43 మందిని గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ… హైదరాబాద్ మల్టీజోన్ 2లో గద్వాల్, పటాన్ చెరు మినహా ప్రజాపాలన గ్రామసభలు ప్రశాంతంగా జరిగాయన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య జరిగిన సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు జరిగిన అన్ని పరిణామాలు తమ నియంత్రణలో ఉన్నాయని తెలిపారు.

క్యాంప్ కార్యాలయం వద్ద ఘటన జరగటం వెనుక ఉన్న శక్తులను గుర్తిస్తామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్, పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, పటాన్ చెరు సీఐ వినాయక రెడ్డి, క్రైమ్ సీఐ రాజు, తదితరులు పాల్గొన్నారు.