ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు… కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి, జనవరి 24 ( సిరి న్యూస్ ) : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 25 జనవరి ,2025 నేషనల్ ఓటర్స్ డే ను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కాంతి వల్లూరు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

జిల్లా కలెక్టర్ కాంతి వల్లూరు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు తమ పాత్రను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని అన్నారు . 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవడం ఎంతో ముఖ్యమని, తమ ఓటు హక్కును ఉపయోగించి దేశాభివృద్ధికి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతంగా కొనసాగడంలో ఓటు హక్కు అమూల్యమైనదిగా నిలుస్తుంది అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ముగ్గుల పోటీ నిర్వహించటం తో రంగు రంగుల ముగ్గుల పోటీలో విద్యార్థులు తమ ప్రతిభను చాటారు . భారతదేశ ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, సహోదరత్వం వంటి అంశాలను ప్రతిబింబించేలా ముగ్గులు వేస్తూ పాల్గొన్నారు.

కార్యక్రమంలో నారాయణఖేడ్ ఆర్డీవో అశోక్ చక్రవర్తి, రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.