మహిళను చంపిన వ్యక్తి అరెస్ట్

మనోహరాబాద్. జనవరి 4 (సిరి న్యూస్) : ఒక మహిళను నమ్మించి సహజీవనం చేస్తూ చంపిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తూప్రాన్ సీఐ రామకృష్ణ, మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ (Tupran CI Ramakrishna, Manoharabad ASI Subhash Goud) లు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ కు చెందిన సూరజ్ కుమార్ చంద్ర వంశీ అనే వ్యక్తి బీహార్ లో రిక్షా నడుపుతూ రజిని దేవి అనే మహిళతో పరిచయం ఏర్పరచుకొని శారీరక సంబంధం పెట్టుకొని బీహార్ లోని ముజఫర్ పూర్ లో వారిద్దరూ సహజీవనం చేశారు.

2023 అక్టోబర్ నెలలో కళ్ళకల్ శివారులోని గీతా ప్యానెల్ ప్రొడక్ట్స్ కంపెనీ కి వచ్చి భార్యాభర్తలమ అని చెప్పి కంపెనీలో పని చేయడం ప్రారంభించారు. కంపెనీలో పనిచేస్తున్న సమయంలో డబ్బుల విషయంలో వీరి మధ్య గొడవలు జరిగాయి. 18.11.2023 నాడు కిరాణా సామాను మరియు మద్యం కొనుగోలు చేసి, వారి గదికి తిరిగి వెళ్ళి మద్యం సేవిస్తూ రజనీ దేవిని డబ్బు అడిగాడు, అందుకు ఆమె నిరాకరించి, నీవు కాకపోతే నేను మరొకరితో కలిసి ఉంటాను అని చెప్పగా..ఆమె మాటలకు కోపోద్రిక్తుడైన అతడు ఆమెను చంపి డబ్బులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

స్నేహంగా నటిస్తూ, ఆమె చున్నిని గొంతుకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేసి ఆమె జీతం డబ్బులలో నుండి 7 వేలు తీసుకుని, గదికి తాళం వేసి పారిపోయి దొంగిలించిన డబ్బులో నుండి 1,500 లతో అతను ఒక ఫోన్‌ను కొనుగోలు చేశాడు. మిగిలిన 5,500 ఢిల్లీలో తన వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేశాడు. మళ్ళీ పనికోసం తిరుగుచుండగా 03.01.2025 నాడు తూప్రాన్ సీఐ రంగ కృష్ణ, మనోహరబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ మరియు సిబ్బంది కలసి చాకచక్యంగా నేరస్తున్ని పట్టుకొని రిమాండ్ కు తరలించారు.