రెండవ రోజు గ్రామసభల్లో ఆందోళనలు…
నిజమైన నిరుపేదలకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి
మనోహరాబాద్, జనవరి 22 సిరి న్యూస్ : భూమిలేని వ్యవసాయ కూలీలకు అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా… ఇండ్లు లేని నిరుపేదలకు అందించే ఇందిరమ్మ ఇండ్ల కోసం పలు గ్రామాలలో నిర్వహించిన గ్రామ సభల్లో అర్హులైన నిరుపేదలు ఆందోళనకు దిగారు. అధికారులు చేపట్టిన సర్వేలన్నీ పచ్చి అబద్దాలని బాధితులు వాపోతూ మండిపడ్డారు. రెండవ రోజైన బుధవారం మండల కేంద్రమైన మనోహరాబాద్, మండలంలోని కాళ్ళకల్, కూచారం, రామయపల్లి, గౌతోజి గూడెం, రంగాయి పల్లి, పోతారం గ్రామాలలో అధికారులు గ్రామ సభలు నిర్వహించారు.
పలు గ్రామాలలో అధికారులు లబ్ధిదారులకు అందించే సంక్షేమ పథకాల పేర్ల లిస్టును చదివి వినిపించగా నిజమైన నిరుపేదలకు అందించే పథకాల లిస్టులో తమ తమ పేర్లు రాలేవని, అనర్హులకు మాత్రమే అధికారులు పేర్లను నమోదు చేశారని మండిపడ్డారు. తక్షణమే అధికారులు పునరాలోచించి నిజమైన నిరుపేదలకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మరోసారి రిసర్వే నిర్వహించి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారు.