మనోహరాబాద్ , జనవరి 26. సిరి న్యూస్ : గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో దోహద పడతాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు అనిత, వెంకటరమణ గుప్త దంపతులు సూచించారు. మండలంలోని జీడిపల్లి గ్రామంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం గ్రామానికి చెందిన దోమకొండ వెంకటరమణ, అనిత దంపతుల కుటుంబ సభ్యులైన అనంత రాములు, విజయ ప్రసాద్ జ్ఞాపకార్థం తో వారితోపాటు మేడ్చల్ కు చెందిన ఆదిత్య ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ శిబిరంలో పలు రకాల రోగాలకు చెందిన ప్రత్యేక డాక్టర్లు పాల్గొని పలువురికి వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ముఖ్యంగా మహిళా డాక్టర్లు పాల్గొని మహిళలకు ఉన్న సమస్యల పైన వైద్య పరీక్ష నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా వెంకటరమణ దంపతులు గత పక్షం రోజుల క్రితం గ్రామంలో రూ. 12 లక్షల సొంత ఖర్చులతో 68 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే గ్రామంలో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 వేలు, ఆడపిల్ల జన్మిస్తే ఆ కుటుంబానికి రూ. 5 వేల చొప్పున అందిస్తూ వారు ఆదుకుంటున్నారు.