ఎమ్మార్పీఎస్ ముప్పై యేండ్లు పోరాడి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించింది
దీనివల్ల ఏ ఒక్క కులానికి అన్యాయం జరగదు
వర్గీకరణ అమలును వేగవంతం చేయాలి
ప్రముఖ కవి, రచయిత డప్పోల్ల రమేష్
సంగారెడ్డి, జనవరి 1 సిరి న్యూస్ : డా.అంబేడ్కర్ సూచించిన సామాజిక న్యాయం వర్గీకరణ అమలు వల్ల సాధించవచ్చని భారత సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పు నిరూపించిందని ‘వెయ్యి గొంతులు – లక్ష డప్పులు’ మహా కళా ప్రదర్శన రాష్ట్ర కోఆర్డినేటర్ , ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి, ప్రముఖ కవి రచయిత డప్పోల్ల రమేష్ మాదిగ అన్నారు. వర్గీకరణ అమలు జాప్యం పట్ల పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఈ దేశంలో రాజ్యాంగ బద్దంగా జరిగిన మన కాలం సామాజిక ప్రజాస్వామిక పోరాటం దండోరా పోరాటం అన్నారు. కనుకనే ఇంతటి విజయం మాదిగలు ప్రజాస్వామికంగా సాధించుకున్నారన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ ముప్పై యేండ్లు పోరాడి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించిందన్నారు. ఫలితంగా గత ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు వెలువరించిన అనుకూల తీర్పు వల్ల వర్గీకరణకు మరే అడ్డంకి లేదని అన్నారు. వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వర్గీకరణ వలన ఏ ఒక్క కులానికి అన్యాయం జరగదని అన్నారు. వర్గీకరణ ఆలస్యం వల్ల బాధిత కులాలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణ సామాజిక సమానత్వాన్ని సాధించే ఇప్పుడు మనముందున్న ఏకైక మార్గం అని అన్నారు. ఇన్నాళ్లు లేని ఐక్యత వర్గీకరణ వల్ల సాధించవచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు ఉదాహరణ గతంలో వర్గీకరణ అమలు జరిగిన కాలంలో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఉమ్మడిగా పోరాడి ప్రమోషన్లలో రిజర్వేషన్లు సాధించడం జరిగిందన్నారు. మూడు దశాబ్దాల మాదిగల ఉద్యమం పట్ల విషం చిమ్ముతున్న పిడికెడు మంది వర్గీకరణ వ్యతిరేక శక్తుల తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో వర్గీకరణ అమలును వేగవంతం చేయాలని కోరుతూ తెలంగాణలో ఉన్న కళానాయకులంతా ఏకమై ‘వెయ్యి గొంతులై గానం చేస్తూ – లక్ష డప్పులు’ మోగిస్తూ హైదరాబాద్ నడిబొడ్డున ఫిబ్రవరి ఏడున మహా కళా ప్రదర్శన నిర్వహించబోతున్నామని అన్నారు.
సబ్బండ వర్గాలు సంఘీభావం తెలిపిన ఉద్యమం, అత్యున్నత న్యాయస్థానం ఆమోదం పొందిన మాదిగల ఉద్యమ ప్రస్థానంపై దురుసుగా, అన్యాయంగా ప్రవర్తించడం సబబు కాదని అన్నారు. మందకృష్ణ మాదిగ గారిని అసభ్య పదజాలంతో దూషించడం సరైన విధానం కాదని అన్నారు. వర్గీకరణ అమలును స్వాగతించి సామాజిక న్యాయాన్ని బలపరచాలన్నారు. రేపటి అణగారిన వర్గాల ఐక్యతకు ప్రతీకగా మందకృష్ణ మాదిగ చారిత్రాత్మక స్ఫూర్తిని అందించిన స్ఫూర్తి ప్రదాతగా దేశ చరిత్రలో నిలిచారని కొనియాడారు.మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా మాదిగ కళా నాయకుల కమిటీని డప్పోల్ల రమేష్ నియమించారు. ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి కోళ్ల శివ మాదిగతో కలిసి డప్పోల్ల రమేష్ నియమించిన ఉమ్మడి మెదక్ జిల్లా కమిటీ వివరాలను ప్రకటించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా మాదిగ కళానాయకుల కమిటీ అధ్యక్షులుగా కవి గాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ, ప్రధాన కార్యదర్శిగా సంగల్ల ప్రవీణ్ మాదిగలను నియమించారు. తెలంగాణ రాష్ట్ర కళానాయకులు ప్రదర్శించే ‘వెయ్యి గొంతులు – లక్ష డప్పులు’ మహా కళా ప్రదర్శన విజయవంతం చేయడమే లక్ష్యంగా చేసుకొని జనవరి ఏడు నుంచి ఫిబ్రవరి ఏడు వరకు కార్యాచరణలో భాగమవుతామని అన్నారు.