బాలికలకు రంగవల్లుల పోటీల నిర్వహణ
రామాయంపేట : స్థానిక మంజీరా విద్యాలయంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థిని లు రంగవల్లుల పోటీలో పాల్గొని చక్కగా ముగ్గులు వేయడం జరిగింది .చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి వాళ్లని ఆశీర్వదించడం జరిగింది. భోగిమంటలు వేసి పతంగులు ఎగురవేసి పాఠశాల అంతా పండుగ వాతావరణంతో నృత్యాలతో మారుమోగింది. వాసవి మాట్లాడుతూ విద్యార్థులకు సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటాము అనేది వివరించడం జరిగింది. సంక్రాంతి అంటే అంటే మిక్కిలి క్రాంతి .కొత్త క్రాంతి మన జీవితాలలో వెలుగును నింపుతుందని సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు.
సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగుపెడుతున్నటువంటి కాలమిది. అందుకే ఈ పండుగను మూడు రోజుల పాటుగా జరుపుకుంటారు. మొదటి రోజున భోగిగా జరుపుకుంటారు. భోగి రోజు ఇంట్లో ఉండేటటువంటి పాత వస్తువులు అన్నిటిని మంటలుగా వేస్తారు. నాలుగు రోడ్ల కూడలిలో పెద్ద మంటగా వేసి చీకటిని పారదోలి దారిద్రం అంతా తొలిగిపోయి నూతన విధానాలకు నాందిగా జరుపుకుంటారు. చిన్నపిల్లలకి ఆ రోజు సాయంత్రం సూర్యునికి ప్రీతిపాత్రమైనటువంటి పండగ కావున రేగిపల్లతో, నాణెలతో చెరుకు గడలతో, పూలు పళ్ళు కలిపి పెద్ద వాళ్ళందరూ చిన్నపిల్లలపై వేసి వాళ్లకి సూర్య భగవానుని అనుగ్రహం ప్రసాదించాలని దీవిస్తారు.
రెండవ రోజు సంక్రాంతి పండగ జరుపుకుంటారు సంక్రాంతి రోజు ఇంటి ముందు ఉదయాన్నే పేడతో అలికి చక్కని ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఇంటి ముందు పాలు పొంగించి అంతా మంచే జరగాలని కోరుకుంటారు . రకరకాల పిండి వంటలు చేసుకుంటారు .చలి నుంచి కాపాడుకోవడానికి శరీరానికి శక్తిని ఇచ్చేటటువంటి బెల్లముతో తయారుచేసినటువంటి నువ్వుల ఉండలు, అరిసెలు ఇలాంటి పిండివంటలు ఎక్కువగా చేసుకుంటారు. ఈ సమయంలో హరిదాసులు, జంగమవార్లు గంగిరెద్దులవారు, బుడుగు జంగమ వారు అనేక మంది కళాకారులు ప్రతి ఇంటి ముందుకు వచ్చి భిక్ష తీసుకొని ఆశీర్వదించి వెళ్తారు. సాక్షాత్ శ్రీమహావిష్ణువు వచ్చినట్టుగా భావించి బిక్ష వేస్తారు.
మూడవరోజు కనుమ ఈరోజు ఇంటి ముందు వ్రతం ముగ్గులు వేసుకుంటారు. వ్యవసాయంలో తమకు చేదోడు వాదోడుగా ఉండే పశువులను పూజిస్తారు .పశువుల పండగగా దీనికి పేరు వ్యవసాయపు పనులు మళ్లీ ఈ రోజు నుంచి మొదలు పెడతారు. ధాన్యం చేతికి వచ్చేటటువంటి సమయం కావున ఈ పండుగను ప్రతి ఒక్కరు, ప్రతి ఇంటి వాళ్ళు ఉత్సాహంగా, సంతోషంగా చేసుకుంటారు .కోడి పందాలు ,పేరంటాళ్ళు పతంగులు ఎగురవేయడం ,పిల్లలు పెద్దలు అందరూ ఉత్సాహంగా చేసుకునే పండగ. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ కుమార్ కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి వాసవి, మౌనిక, మీనా, శ్రీశైలం సంధ్య ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు