అమాయకుల అవసరాలే ఆసరాగా అడ్డగోలు దోపిడీ..
తీసుకున్న రుణంలో 20 శాతం చార్జీల పేరుతో కటింగ్..
ఆస్తులున్నా ప్రభుత్వ బ్యాంకుల్లో లభించని రుణం..
ఉమ్మడి జిల్లాలో ఆంధ్రా వడ్డీ వ్యాపారుల దోపిడీ..
సిద్దిపేట : అమాయక అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ఆగడాలకు ప్రజలు బలవుతున్నారు. తీసుకున్న రుణంలో సుమారు 20 శాతం వరకు పేపర్, బ్యాంకింగ్ తదితర కారణాలు చూపి చార్జీల కింద తొలగిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు ప్రైవేట్ ఫైనాన్సులను ఆశ్రయించక తప్పడం లేదు. ఇదే అదనుగా ఫైనాన్స్ సంస్థల నిర్వాహకులు బాధితుల బ్యాంక్ ఖాతాకు సంబంధించి మూడు నెలల లావాదేవీల చిట్టా అడుగుతారు. బ్యాంక్ సిబిల్ స్కోర్ చూస్తారు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని, అందుకు గాను వారి వాహనాలను, ఇల్లు, ఖాళీ స్థలాలను తనఖా చేసుకుంటున్నారు. ఎలాంటి స్థిర లేదా చరాస్థులు లేనివారికి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ష్యూరిటీపై రుణాలు ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ష్యూరిటీ ఇవ్వాలంటే వారికి రుణంగా తీసుకునే మొత్తంలో 5 శాతం ఇవ్వాలని, అయితేనే వారు అంగీకరిస్తారు. రుణం మొత్తానికి వడ్డీ, మొదటి నెల చెల్లించాల్సిన ఈఎంఐ ముందుగానే కట్ చేసుకుని డబ్బులు ఇస్తారు. ఇలా ప్రైవేట్ ఫైనాన్స్‌ల వద్ద రుణం తీసుకున్న వారికి సుమారు 25 శాతం వరకు డబ్బులు పోను మిగిలిన 75 శాతం మాత్రమే రుణగ్రస్తులకు చేరుతాయి.
అవసరమున్నంత డబ్బు కావాలని వెళ్ళిన వారికి సుమారు 50 శాతం అంటే సగం వరకు మాత్రమే ఫైనాన్స్ లభించడం వల్ల సదరు వ్యక్తి మిగతా డబ్బులకు మరోచోట అప్పు చేయాల్సిందే. ఇలా ఒక వ్యక్తి ఒకే అవసరానికి పలుచోట్ల అప్పు చేయడం వల్ల తాను సంపాదించే దానికన్నా మించి ప్రతినెలా వడ్డీ, ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుంది. కొన్ని నెలలు చెల్లించాక బాధితులకు ఈఎంఐలు భారంగా మారుతోంది. దాంతో ఫైనాన్స్‌లకు బకాయిపడతారు. ఈఎంఐ చెల్లించడంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ర్ఓజులు కాగానే ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఫోన్ చేయడం మొదలు పెడతారు. ఒకటి లేదా రెండు నెలలు బకాయి పడితే వాహనాలను సీజ్ చేస్తారు. ష్యూరిటీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేస్తారు. ఇక ఇంటికి వెళ్ళడం, రుణగ్రస్తులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి భయభ్రాంతులకు గురి చేయడం, ఇతరుల ముందు కించపరిచే విధంగా మాట్లాడడం,ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల ముందు అసభ్య పదజాలంతో దూషించడం ఫైనాన్స్ సంస్థల నిర్వాహకులు చేసే పని. ప్రభుత్వ బ్యాంకుల్లో పేరొందిన వ్యాపారులకు, పైరవీకారులకు తప్ప మరెవరికి రుణం లభించని పరిస్థితి. అందుకే ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు విస్తరిస్తున్నాయి. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సహించేందుకు ముద్ర పథకం ద్వారా రుణం పొందే అవకాశం కల్పించినప్పటికీ బ్యాంకు నిబంధనలతో రుణం పొందలేక పోతున్నారు. దాంతో ప్రైవేట్ ఫైనాన్స్‌లను ఆశ్రయిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలోని ప్రధాన పట్టణాలైన సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల, మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, జోగిపేట, జహీరాబాద్, సదాశివపేట ప్రాంతాల్లో ఫైనాన్స్ సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారానే వ్యాపారం కొనసాగిస్తున్నాయి. సిద్దిపేట రూరల్ మండలంలోని పెద్దలింగారెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల ప్రైవేట్ ఫైనాన్స్ ప్రతినిధులు ఫోన్ ద్వారా వేధించడమే కాకుండా ఇంటి ముందు బైఠాయించారు. దుర్భాషలాడుతూ, అమర్యాదగా ప్రవర్తించారు. మనస్థాపం చెందిన వ్యక్తి గ్రామం శివారులోని మామిడితోటలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు ఫైనాన్స్ నిర్వాహకుపై ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోగా మృతునిపై కేసు నమోదు చేశారు. ఇలా వెలుగులోకి రాకుండా ఉన్న సంఘటనలు అనేకంగా ఉంటాయని తెలుస్తోంది.
పోలీసుల దాడులు…
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఇటీవల పోలీసులు వడ్డీ వ్యాపారులపై ఆకస్మిక దాడులు చేశారు. వారి ఇంట్లో, ఆఫీసులో ఉన్న నగదును, బంగారు వస్తువులను సీజ్ చేశారు. దాంతో గ్రామాలలో, చిన్నచిన్న పట్టణాల్లో వడ్డీకి రుణం లభించే అవకాశం లేకుండా పోయింది. పంటల సాగు కోసం రైతులు అవసరమైన డబ్బులు కావాలంటే రుణం దొరకడం సమస్యగా మారింది. అందుకే ప్రైవేట్ ఫైనాన్సులు గ్రామాల వరకు చేరుకున్నాయి.
ఆంధ్రా వ్యాపారుల దోపిడీ…
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు వడ్డీలకు ఇస్తున్నారు. వారు డబ్బులు అప్పుగా ఇవ్వాలి అంటే ముందుగా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ.50వేల రుణం కావాలంటే ముందుగా రూ.15వేలు ఇవ్వాలి. వారం రోజులు గడిచాక రూ.50వేలు అప్పుగా ఇస్తారు. ప్రతి వారంలో ఒకరోజు ఇంటికి వసూలుకు వస్తారు. నిమిషం లేటయినా ఇంటి ముందు బైఠాయించి రచ్చరచ్చ చేస్తారు. ఇది ఆంధ్ర వ్యాపారుల ముఠా పనితీరు. వీరి ప్రవర్తన పట్ల బాధితులు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ముఠాకు చెందిన పెద్ద మనుషులు రంగంలోకి దిగి పోలీసులతో బేరం కుదుర్చకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోనే కాకుండా ఉమ్మడి జిల్లాలో అనేక సంఘటనలు జరిగినా కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని ప్రైవేట్ ఫైనాన్స్‌ల ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.