విద్యారంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టాలి..
ఎస్‌జీటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలి..
పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తా..
ప్రాథమిక పాఠశాలలో తరగతికో ఉపాధ్యాయుడు కావాలి..
ఉద్యమ నేతగా, ఉపాధ్యాయుల వారధిగా గుర్తింపు ఉంది..
గెలిపిస్తే సమస్యలపై గళమెత్తుతా…
సిరి ప్రత్యేక ఇంటర్వూలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సంకినేని మధుసూదన్‌రావు..
రాష్ట్రంలో ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి చేయడమే కాకుండా సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలపై మండలిలో గళమెత్తి పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు సంకినేని మధుసూదన్‌రావు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా పోరాటం చేసి ఉపాధ్యాయ సమస్యలపై గొంతుకగా నిలిచిన తనను గెలిపిస్తే అన్ని రంగాలకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధికి శాయశక్తులా పాటుపడతా అంటూ ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సంకినేని మధుసూదన్‌రావుతో సిరి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.
సిరి..ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణం ?
మధుసూదన్‌రావు: రాష్ట్రంలో విద్య, వైద్యం ఉచితంగా అందినప్పుడే సత్పలితాలను సాధించగలుగుతాం. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యారంగంలో పెనుమార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. విద్యావ్యవస్థలో సంస్కరణలు చేయాలి. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలంటే పోరాడేతత్వం, గొంతు విప్పే నాయకులు అవసరం. అందుకే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన తాను విద్యావంతలు కేటగిరిలో ఎమ్మెల్సీగా నిలబడుతున్నాను.
సిరి..ఎన్నికల్లో మీ ఎజెండా ఏమిటి ?
మధుసూదన్‌రావు ః ప్రత్యేక ఎజెండా అని కాకుండా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావడమే తన ఎజెండా. ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉచిత అందించాలి. ఓవైపు విద్యా వ్యవస్థలో మార్పు కోరుతూనే విద్యను బోధించే ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తాం. పట్టభద్రులు అయిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రతియేడు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. ఎందరో నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ ప్రకటన పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తాం.
సిరి..ఎస్‌జీటీలకు ఓటు హక్కుపై మీ అభిప్రాయం ?
మధుసూదన్‌రావుః అసలు సమస్య అదే. ఉపాధ్యాయులుగా ఎంపికైన సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, నాయకులు గెలుపొందినా వారి స్వప్రయోజనాలకే పని చేశారు. తనను గెలిపిస్తే ఎస్‌జీటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించడమే తన ప్రధాన ఎజెండా. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 58వేల ఎస్‌జీటీ ఉపాధ్యాయులు ఉన్నారు. వారందరి ఓటు ఎంతో ప్రధానమైనది. ప్రభుత్వాలు ఎస్జీటీలకు కూడా ఓటు హక్కు కల్పించాలన్నదే తన ఉద్దేశ్యం.
సిరి..ప్రాథమిక విద్యలో మార్పు తెస్తారా ?
మధుసూదన్‌రావుః రాష్ట్రంలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. విద్యావ్యవస్థలో ప్రాథమిక విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముందుగా ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తేనే విద్యావ్యవస్థ మెరుగుపడుతుంది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు అనేదే మా నినాదం. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల ప్రాథమిక దశలోనే గండి పడుతుంది. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వాలు ప్రాథమిక విద్యను పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించలేక పోతున్నాం. ఈ విధానానికి స్వస్తి పలికి ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడిని నియమించాలన్నదే మా పోరాటం. కచ్చితంగా ప్రాథమిక విద్యను బలోపేతం చేయడమే తమ లక్ష్యం.
సిరి..మీరు పట్టభద్రుల స్థానం నుండి ఎందుకు పోటీ చేస్తున్నారు ?
మధుసూదన్‌రావుః వాస్తవానికి తాను టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేయాల్సింది. కానీ ఎస్‌జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోవడంతో పట్టభద్రుల అభ్యర్థిగా రంగంలో ఉన్నాను. ఎస్‌జీటీలుగా ఉన్న టీచర్లకు ఓటు హక్కు కల్పించక పోయినా చాలామంది ఎస్‌జీటీలు పట్టభద్రులుగా ఉన్నారు. వారి సహకారంతోనే పట్టభద్రుల అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. తన పోరాటం కూడా ఎస్జీటీల న్యాయమైన సమస్యల సాధనకే పాటుపడతా.
సిరి..మీకు ఏ పార్టీ మద్దతు ఉంది ?
మధుసూదన్‌రావుః తాను అందరివాడిని. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాను. ఉద్యమకారుడిగా, ఉపాధ్యాయ నేతగా చాలా పోరాటాలు చేశాను. ఉద్యమంలో కేసీఆర్‌కు వెన్నంటి ఉన్నాం. తనకు పార్టీల మద్దతు ఎలావున్నా ఎస్జీటీ ఉపాధ్యాయులు, పట్టభద్రుల సహకారం ఉంది. తాను గెలుస్తానన్ననమ్మకం కలిగింది. ఎస్జీటీల మద్దతు తనకు సంపూర్ణంగా ఉంది. తమ సమస్యలను పరిష్కరించేందుకు ఏ పార్టీ ముందుకొచ్చి కోరినా ఆ పార్టీ మద్దతు తీసుకుంటాం.