గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఇంటికే..
మెదక్ : ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు లేరా అంటూ మెదక్ ఎంపీ రఘునందన్ రావ్ ప్రశ్నించారు. మంగళవారం నాడు టీఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరణ కు విచ్చేసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ… సొంత జిల్లా అయిన మెదక్ లో గ్రాడ్యూవేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టుకొలేని దీనస్థితికి బీఆర్ఎస్ పార్టీ దిగజారి పోయిందన్నారు. వరంగల్ జిల్లాలో పక్క పార్టీల అభ్యర్థులను తెచ్చి 50 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెట్టారు కానీ తెలంగాణ ఉద్యమంలో పెన్డౌన్, గన్డౌన్ అని అన్నిటికి ముందున్న ఉద్యమనేత దేవి ప్రసాద్ కు ఎందుకు టికెట్ ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు.
అభ్యర్థుల విషయంలో ఎగిరెగిరి పడుతున్న ఆ పార్టీ యువరాజు కేటీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మే 17వ తారీకు 2001లో కరీంనగర్ గడ్డపై జై తెలంగాణ అన్న పార్టీ ఇప్పుడు అక్కడ ఎందుకు పోటీ చేస్తలేదంటూ నిలదీసారు. మెదక్ పార్లమెంటు స్థానంలో ఓడిపోయిన బిఆర్ఎస్ కు ప్రజలు సిఆర్ఎస్ ( కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ) ఇచ్చారంటు సెటైర్లు వేశారు. చదువుకున్న మేధావులు అందరూ బిజెపి వైపు చూస్తున్నారని జరగబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికలతో బీఆర్ఎస్ పార్టీ జిల్లాలనే కదు రాష్ట్రంలో కూడా లేదని తేలిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, అసెంబ్లీ ఇంచార్జ్ పంజా విజయ్, నాయిని ప్రసాద్, ఎంఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.