* మాఘ అమావాస్య పుణ్య స్నానాలతో చాముండేశ్వరి దేవిని దర్శించుకున్న భక్తులు
* భక్తులకు ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు నిర్వహించిన పోలీసులు…
చిలిపిచేడ్ జనవరి 29 (సిరి న్యూస్) : మాఘ అమావాస్య రోజున నది స్నానాలాచరించి దైవ దర్శనంగావించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్మకంతో బుధవారం నాడు మఘ అమావాస్య పర్వదినం పురస్కరించుకొని మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ చాముండేశ్వరి ఆలయంలో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు రాష్ట్ర నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన భక్తులు మంజీరా నదిలో మాఘ అమావాస్య పుణ్యస్నానాలు ఆచరించారు.
అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో మారు మోగింది. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్నివిధాలుగా ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రాంగణంలో భక్తుల రద్దీని గుర్తించి ఎప్పటికి అప్పుడు వారికి సూచనలు చేస్తూ అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసువారు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మండల పరిధిలోని శ్రీ చాముండేశ్వరి మాత ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలు సందర్భంగా ప్రాంతమంతా జన సంద్రంగా మారింది. అమ్మవారిని దర్శించుకున్న మండల ప్రజలతో పాటు సంగారెడ్డి జోగిపేట మెదక్ ప్రాంతాల వారు కూడా దర్శించుకొని తరించారు. సుమారు 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారని ఆలయ నిర్వాహకులు చాముండేశ్వరి శక్తి సంఘం సభ్యులు శోభన్ బాబు ప్రధాన అర్చకులు ప్రభాకర శర్మ తెలిపారు.