రామచంద్రపురం : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా యాక్షన్ మళ్లీ షురూ అయ్యింది. మున్సిపాలిటీ లిమిట్స్‌లోని చక్రపురి కాలనీ సమీపంలో పెద్ద చెరువు ఆక్రమణలను మరోసారి కూల్చివేసింది. మంగళవారం ఉదయం నుండి హైడ్రా టీమ్ ఈ కూల్చివేతలను మొదలుపెట్టింది. గతంలో మూడు నెలల క్రితం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారని ఇక్కడే కూల్చివేతలు జరుగగా తిరిగి ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టడంతో హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఆంధ్రాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన స్థలంలో ఈ నిర్మాణాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే హైడ్రా అధికారులు యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. తమ లేఅవుట్‌కి సంబంధించిన స్థలాలను రాంభూపాల్ రెడ్డి ఆక్రమించి ఫెన్సింగ్ వేస్తున్నారని స్థానికుల కొంతమంది సోమవారం హైడ్రా ప్రజావాణిలో పిర్యాధు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కమీషనర్ రంగనాథ్ కూల్చివేతలకు ఆర్డర్ ఇవ్వడంతో మంగళవారం అక్కడి నిర్మాణాలను తొలగించారు. ఐలాపూర్ తండాకు చెందిన వివాదాస్పద భూములను కూడా మంగళవారం హైడ్రా అధికారులు పరిశీలించారు. అమీన్పూర్ పరిధిలోని ప్రజల నుండి వందలాది కంప్లైట్స్ వస్తున్నాయని, అన్ని ఫిర్యాదులపై విచారణ చేపట్టి త్వరలోనే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.