ప్రభుత్వ భూములను రక్షించాలి

అధికారులు కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారు
అక్ర‌మ నిర్మాణాల నామమాత్రపు కూల్చివేతలపై గ్రామస్తుల ఆగ్రహం

జిన్నారం జనవరి 08 (సిరి న్యూస్) : జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 10 లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. గత రెండు రోజుల క్రితం గ్రామస్తులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయగా వెంటనే స్పందించిన త‌హ‌సిల్దార్ బిక్షపతి ఆదేశాల మేరకు ఆర్ఐ జయప్రకాష్ నారాయణ అక్రమ నిర్మాణాలను జెసిబి సహాయంతో కూల్చివేతలు చేశారు. కాగా అధికారుల చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఎనిమిది ఇండ్లు ఉండగా కేవలం మూడింటిని మాత్రమే కూల్చివేతలు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారని, అధికారుల చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులు కంటి తుడుపు చర్యలు చేపట్టడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సరైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.