పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహాదేవుని భాస్కర్
ఘనంగా జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు
గజ్వేల్ జనవరి 24(సిరి న్యూస్): బాలికలు భవిష్యత్తులో గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని ఎంపీ యుపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహాదేవుని భాస్కర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ లో సి సి సి, నేలమ్మ మహిళ రైతుల పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపియుపిఎస్ ఆర్ అండ్ ఆర్ కాలనీ పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు బాలిక విద్యా ప్రాముఖ్యత అనే అంశం పైన వ్యాసరచన పోటీలు నిర్వహించి వ్యాస రచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రధానం చేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు మహాదేవుని భాస్కర్ మాట్లాడుతూ సిసిసి తరఫున ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తమ పాఠశాలలో నిర్వహించడం హర్షనీయమని అన్నారు. బాలికలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. సిసిసి కో ఆర్డినేటర్ శ్వేత, నేలమ్మ మహిళ రైతుల పరస్పర సహకారం కోశాధికారి సుజాత మాట్లాడుతూ జాతీయ బాలిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకునే క్రమంలో బాలికలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించడం, వారి విద్య, ఆరోగ్యం, పోషకాహారం ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.
గతంలో బాలికలకు విద్య అవకాశాలు చాలా తక్కువగా ఉండేవని, ఆ పరిస్థితి నేడు మారి బాలికలకు సమానంగా విద్యా అవకాశాలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. మనకు అందుబాటులో ఉన్న అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. బాలికలు ఈ రంగంలో రాణించలేరు అనే అపోహలను తొలగించే దిశగా బాలికలంతా విద్య, వైద్యం, క్రీడలు,సాంస్కృతిక, మొదలైన వివిధ అన్ని రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. మహిళలకు ప్రోత్సాహం ఉంటే ఈ రంగమేదైనా దూసుకుపోగలమని నేటి మహిళలు నిరూపిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మంజుల, ఆర్ రేణుక, ఎం ప్రభావతి, బి గీతా మాధురి, సిహెచ్ శ్వేత, శ్రీకరి, సి సి సి దుర్గయ్య, రిపోర్టర్ బాబు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.