- క్షేత్రస్థాయి సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
- సర్వేలో తప్పులు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలి
- ప్రతి లబ్ధిదారుని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి
- అవసరమైన డేటాను సక్రమంగా నమోదు చేయాలి
- జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సుల్తాన్పూర్, సరాఫ్ పల్లి గ్రామాలను సందర్శించి, సర్వే బృందాల పనితీరును తనిఖీచేసిన కలెక్టర్
సంగారెడ్డి, జనవరి 17 ( సిరి న్యూస్ )
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రధాన పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు క్షేత్ర స్థాయిలో నిర్వహించబడుతున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు.శుక్రవారం ఆమె చౌటకూర్ మండలంలోని సుల్తాన్పూర్, సరాఫ్ పల్లి గ్రామాలను సందర్శించి, సర్వే బృందాల పనితీరును తనిఖీ చేశారు.

సర్వే కోసం నియమించిన బృందం లోని సిబ్బంది అందరు వచ్చారా లేదా అని పరిశీలించారు. సర్వే కోసం నియమించిన బృంద అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ సర్వే లో తప్పులు లేకుండా భాద్యతతో పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారుని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైన డేటాను సక్రమంగా నమోదు చేయాలంటూ అధికారుల ను ఆదేశించారు . ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియలో సరైన డేటాను సేకరించాలని అన్నారు . ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఖచ్చితత్వంతో ఈ ప్రక్రియను నిర్వహించాలని ఆమె స్పష్టం చేశారు. సుల్తాన్పూర్ ,సరాఫ్ పల్లి గ్రామాలలో కలెక్టర్ స్వయంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వారి పరిస్థితులను సమీక్షించారు. లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, వారికి ఉన్న వ్యవసాయ భూమి, కుటుంబం సభ్యుల వివరాలు, పథకాలకు అర్హత వంటి అంశాలను ఆమె సర్వే బృందాలతో కలిసి పరిశీలించారు. సర్వే ప్రక్రియలో ప్రజలను స్థానిక నాయకులను భాగస్వాములుగా చేసి, ప్రజలతో నేరుగా మమేకమవడం ద్వారా తగిన సమాచారం సేకరించాలి.ఇందిరమ్మ ఇళ్లు పథకంలో గృహిణులకు నివాసాలను అందజేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు సంక్షేమాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు . సర్వే బృందాల పనితీరును సమీక్షించిన కలెక్టర్, జాప్యం లేకుండా త్వరితగతిన సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.సర్వే బృందాలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, తగిన సూచనలు చేశారు . కలెక్టర్ వెంట అందోల్ ఆర్డీఓ పాండు , తహసీల్దార్ కిరణ్ కుమార్ సంబంధిత తదితరులు ఉన్నారు.