సాగు భూములకే రైతు భరోసా

మండల వ్యవసాయ అధికారి నాగరాజు

గజ్వేల్ జనవరి 16 సిరి న్యూస్: సాగు భూములకే రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి నాగరాజు పేర్కొన్నారు. గురువారం గజ్వెల్ మండల పరిధిలోని జాలిగామ, దాచారం, సింగాటం, శేరిపల్లి తదితర గ్రామాలలో రెవెన్యూ, వ్యవసాయ శాఖల సిబ్బంది క్షేత్రస్థాయిలో వ్యవసాయ భూములను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వ్యవసాయ యోగ్యం కానీ భూములను గుర్తించడం జరుగుతుందని తెలిపారు.భూ భారతి (ధరణి ) పోర్టల్ లో నమోదైనా వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణానికి మాత్రమే రైతు భరోసా సహాయం ఎకరాకు రూ. 12000 అందించబడుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యం కాని ఇళ్లు లేదా కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు, రియల్ ఎస్టేట్, లే అవుట్, రోడ్లుగా మారిన భూములకు రైతు భరోసా సహాయం ఇవ్వడంలేదని అన్నారు.అదేవిధంగా పరిశ్రమలు, గోదాములు, మైనింగ్ కు వినియోగిస్తున్న భూములు, ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు,రాళ్లు, రప్పలు, గుట్టలతో నిండి సాగుకు అనువుగా లేని భూములను గుర్తించి వాటికీ రైతు భరోసా సహాయం లిస్టులో నుంచి తొలగించడం జరుగుతుందని వివరించారు.