మితిమీరుతున్న కాంగ్రెస్ మోసాలు..

Excessive frauds of Congress..
Excessive frauds of Congress..

సర్కారు తీరుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు..
అమలు కాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్..
అధికారంలోకి వచ్చి 420 రోజులైనా ఏ హామీ సరిగా నిరవేర్చలే..
ఢిల్లీ నుండి వచ్చిన నకిలీ గాంధీలు గాలి మాటలు చెబుతున్నారు..

మెదక్ : అమలు కానీ హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం నాడు గాంధీ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, బట్టి జగపతి, మల్లికార్జున్ గౌడ్, కృష్ణారెడ్డి, మామిళ్ళ ఆంజనేయులు తో పాటు కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ….తమ హయాంలో పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతిపథంలో నడిపించి సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. కాని మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారని, ఎన్నికల్లో పంచిన గ్యారెంటీ కార్డుకు, ఇచ్చిన 420 హామీలకు పాతరేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెళ్లదీస్తున్నరన్నారు.

సర్కారు తీరుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని చివరికి బీఆర్ఎస్ ప్రభుత్వం నింపిన ఉద్యోగాలను తన జేబులో వేసుకునే నీచ రాజకీయాలకు తెరతీశారని ఆరోపించారు. యువత భవితను అంధకారంలోకి నెట్టి క్షమించలేని పాపాన్ని మూటగట్టుకున్నారు. 420 హామీల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానాన్ని కూడా 420 రోజులైనా సరిగా అమలుచేయని ఈ కాంగ్రెస్ సర్కారు మోసాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. గల్లీలో ఉండే కాంగ్రెస్ నేతలే కాదు.. ఢిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు కూడా గాలిమాటలు చెప్పి తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకున్న తరువాత ఇప్పటివరకు ఆ నకిలీ గాంధీలు తెలంగాణ వైపు కనీసం కూడా కన్నెత్తి చూడలేదన్నారు.

ఓవైపు రైతులను, మరోవైపు మహిళలను, ఇంకోవైపు వృద్ధులు, వికలాంగులను, 2 లక్షల ఉద్యోగాలిస్తామని యువతను, ఇలా ప్రతి వర్గాన్ని నయవంచనకు గురిచేసిన ఈ కాంగ్రెస్ సర్కారుకు ఇప్పటికైనా కళ్లు తెరిపించాలని మహాత్మా గాంధీ గారిని సవినయంగా కోరుకుంటున్నామని, నమ్మి ఓటేసిన పాపానికి గొంతుకోసిన ఈ అసమర్థ సీఎంకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని గాంధీని వేడుకుంటున్నట్లు తెలిపారు. దద్దమ్మ సర్కారుకు 420 హామీల్లో కొన్నైనా అమలుచేసే తెలివినివ్వాలని గాంధీని ప్రార్థించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ కన్వీనర్లు కృష్ణ గౌడ్, లింగ రెడ్డి, జుబేర్ అహ్మద్, మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్లు బీమరి.కిషోర్ జయరాజ్, సుంకయ్య, మాజీ కౌన్సిలర్ చంద్రకళ, రబీ దివాకర్, మెదక్,హవెలిఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు యం. అంజ గౌడ్, సిహెచ్.శ్రీనివాస్ రెడ్డి,నాయకులు ప్రభు రెడ్డి, మోచి. కిషన్,పాపయ్య, రాజు, శంకర్, చంద్రశేఖర్ గౌడ్, మధు, బట్టి. ఉదయ్, శ్రీకాంత్, సంతోష్, ఫాజిల్, అరుణ్, సాయిలు, సాయ గౌడ్, మోహన్, శ్రీనివాస్ గౌడ్, బాలయ్య,శ్రీధర్ రెడ్డి, కిరణ్, వినయ్,రంజిత్, చాంద్ పాషా, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.