ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి

రహదారి భద్రతా నియమాలను పాటించాలి
నేడు జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ ప్రతినిధి, జ‌న‌వ‌రి 21 సిరి న్యూస్ : ఈ నెల 23న ఐడిఓసి కార్యాలయంలో రవాణా శాఖ ఆద్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అందులో భాగంగానే రహదారి సురక్ష అభియాన్ శ్రద్ధ 2025 గోడ పత్రికను మంగళవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ఈ నెల 1వ తేది నుండి 31 వరకు నెల రోజుల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమము ప్రధాన ఉద్దేశ్యం ప్రజలకు రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించి ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాటమని ఆయన స్పష్టం చేశారు.అందులో భాగంగానే నేడు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి రాందాస్ చౌరస్తా వరకు ‌ 9వ తరగతి నుండి డిగ్రీ కాలేజ్ చదువుతున్న విద్యార్థులతో బైక్ ర్యాలీ ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.

ఈ భద్రాతా వారోత్సవాలల్లో భాగంగా ప్రజలలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంచడం, రోడ్డు భద్రతా శిక్షణలో భాగంగా వాహన డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రదర్శనలు నిర్వహించడం,సురక్షిత రవాణాపై పల్లె నుంచి పట్టణాలకు రవాణాపై ప్రచార యాత్రలు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భాగస్వాములవ్వాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ వెంకటస్వామి, విజయలక్ష్మి, శ్రీలేఖ, విజయలక్ష్మి, కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.