ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం – మంత్రి పొన్నం ప్రభాకర్

అసెంబ్లీ ఎన్నికల హామీ మేరకు రైతు భరోసా
భూమిలేని పేదలకు రూ.12వేలు
అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు
జ‌న‌వ‌రి 26 నుంచి అమ‌లు
రైతు వ్యతిరేక చట్టాలు తెస్తున్న బిజెపి
బిజెపి – బిఆర్ఎస్ దొందు దొందే
తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.. అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, జ‌న‌వ‌రి 6 సిరి న్యూస్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంను రాజకీయంగా ఇబ్బంది పెడుతూ ఒకే ఎజెండా కలిగిన బిజెపి – బిఆర్ఎస్ దొందు దొందే అని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రాధాన్యత పథకాలు కల్పిస్తున్నామని.. ఈ మేరకు తెలంగాణ రైతులకు గత ఎన్నికల హామీ మేరకు రైతు భరోసా.. భూమిలేని పేదలకు 12వేలు.. అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు జనవరి 26 నుండి అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇప్పటికే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. 500 కి గ్యాస్.. 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు.. 2 లక్షల రైతు రుణమాఫీ.. గురుకుల హాస్టల్ లో విద్యార్థులకు 40 శాతం డైట్ చార్జీలు పెంచడం అలాగే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాబోయే రోజులలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. గత పదేళ్ల బిఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని.. పైగా సుమారు 40వేల కోట్లు బకాయిలు పెండింగ్ లో పెట్టారని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలు తెస్తున్న బిజెపి నిర్వాకం వల్లే రైతు సంఘం నాయకుడు దల్జీర్ సింగ్ 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో సన్నవడ్లకు 500 బోనస్.. 2 లక్షల రుణమాఫీ అమలు చేశారా అని ప్రశ్నించారు.

ఆర్థిక పరిస్థితులపై అనేక సందర్భాలలో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరమని ఏనాడు పట్టించుకోలేదని పైన పటారం.. లోన లొటారం అన్న విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. బిజెపి కిషన్ రెడ్డి, బండి సంజయ్ బిఆర్ఎస్ కేటీఆర్ ఒకే స్వరంతో మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్త తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, కౌన్సిలర్ లు వల్లపు రాజు, చిత్తారి పద్మ, భూక్య సరోజన, పున్న లావణ్య సది, నాయకులు అక్కు శ్రీనివాస్, చిత్తారి రవీందర్, ఎండి హసన్, బూరుగు కృష్ణస్వామి, ఏఎంసి సభ్యుల తోపాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.