కొండాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖి చేసిన జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్ట్ అమలులో పారదర్శకత, సమర్థత, వేగం తీసుకొచ్చేందుకు విశేష చర్యలు చేపట్టామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్  క్రాంతి వల్లూరు తెలిపారు. శుక్రవారం కొండాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి, దరఖాస్తుల ప్రక్రియ, విధానాలను సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్  క్రాంతి వల్లూరు  మాట్లాడుతూ, భూభారతి గ్రామ సభలలో రైతుల నుండి స్వీకరించిన దరఖాస్తుల ప్రక్రియను త్వరితంగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తులు భూభారతి చట్టం  తహసీల్దార్ లాగిన్‌ ద్వారా ఆన్లైన్‌లో అప్లోడ్ చేయాలని, దానికి అనుగుణంగా భూసంబంధిత సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు భూమి సంబంధిత సర్టిఫికెట్లు, రికార్డులు పొందడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడమే మా ప్రథమ లక్ష్యం అని అన్నారు. ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి రెవెన్యూ అధికారిపై ఉందని అన్నారు.