సైబర్ నేరగాల పట్ల తస్మాత్ జాగ్రత్త
జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
మెదక్ ప్రతినిధి, ఫిబ్రవరి 02(సిరి న్యూస్): సైబర్ నేరగాళ్ల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారు చూపే మోసపూరిత ఆశలకు గురికారాదని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడం జరుగుతుందని ముఖ్యంగా అధిక లాభాల కోసం ఆశపడి ఆన్లైన్లో పెట్టుబడి పెట్టద్దని, సోషల్ మీడియాలో యాడ్స్ చూసి మోసపోవద్దన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు మీకు క్యూఆర్ కోడ్ పంపించి దాన్ని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్తే నమ్మవద్దని అది సైబర్ మోసం అని గ్రహించాలని సూచించారు. ఆన్లైన్ లోన్స్ గురించి లోన్స్ యాప్లను మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసినప్పుడు మీ ఫోన్లో ఉన్న అన్ని ఫోన్ నెంబర్లు, ఫోటోలతో పాటు వ్యక్తిగత వివరాలు యాప్ వారు మీ అనుమతి లేకుండా తీసుకుంటారని తర్వాత తీసుకున్న లోన్ తిరిగి కట్టిన ఎక్కువ డబ్బులు కట్టమని ఆ వివరాలతో వేధింపులకు గురి చేస్తారు తస్మాత్ జాగ్రత్త అని ఆన్లైన్ లోన్ ఆప్స్ ద్వారా లోన్స్ తీసుకోరాదని సూచించారు. లోన్ ఆప్స్ వేధింపులకు బయపడి క్షణికావేశాలకు పోవద్దని వెంటనే 1930 కి లేదా డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కస్టమర్ కేర్ నెంబర్‌ను సంబంధిత వెబ్సైట్ నుండి మాత్రమే తీసుకోవాలి. సైబర్ నేరగాళ్లు గూగుల్ నందు నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ నుంచి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పండుగలకు షాపింగ్ చేసే సమయంలో ఇచ్చే లాటరీ కూపన్లలో వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని ఎస్పీ సూచించారు. లాటరీ కూపన్‌లో నమోదు చేసే ఫోన్ నెంబరు, మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఎవరైనా ఈ తరహా మోసాల బారినపడితే 1930 కి ఫోన్ చేయాలని అన్నారు. తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ లో కానీ, ఇంస్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్లో కానీ వీడియో కాల్ చేసి ఫోటో లను న్యూడ్ ఫోటోలుగా మార్ఫింగ్ చేసి మీ బంధువులకి ఫోన్ చేస్తామని, వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతారని అందుకు బయపడవద్దని తెలిపారు. అంతేకాకుండా పార్ట్ టైం జాబ్ ఇస్తామని, లాటరీ వచ్చింది అనో, గిఫ్ట్ వచ్చిందనో, కేవైసి అప్డేట్ చేయాలని చెప్పి సైబర్ నేరగాళ్లు పర్సనల్ డీటెయిల్స్ తీసుకొని డబ్బు కాజేస్తున్నారన్నారు. ఆన్లైన్ సైబర్ నేరగాళ్ల మోసాల్లో పడకుండా అప్రమత్తంగా ఉండడం అవశ్యకం అని ఎస్పీ తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి తోటి వారిని సైబర్ నేరాల బారిన పడకుండా వారికి అవగాహన కల్పించండి అని జిల్లా ప్రజలను ఎస్పీ కోరారు.