Cyclone Fengal | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫాను ఇవాళ పుదుచ్చేరికి దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ఫెంగల్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నైలోని విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. అలాగే, ఏపీ తిరుపతిలోనూ విమానాల రాకపోకలపై ప్రతికూల ప్రభావం పడింది. దాంతో హైదరాబాద్ నుంచి నడవాల్సిన విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలతో పాటు తిరుపతి నుంచి హైదరాబాద్ విమానాలను రద్దు చేశారు. ఇక చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలను రద్దు చేస్తూ ఎయిర్ లైన్స్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
ముంబయి, ఢిల్లీ నుంచి చెన్నైకి బయలుదేరాల్సిన విమానాలను దారి మళ్లించారు. చెన్నై-విశాఖపట్నం-చెన్నై, తిరుపతి-విశాఖపట్నం, తిరుపతి మధ్య సర్వీసులు నిలిచిపోయాయి. ఫెంగల్ తుఫాను ప్రభావంతో రాజధాని చెన్నైలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు పూర్తిగా నీటమునిగాయి. బలమైన ఈదురుగాలులతో కురుస్తున్న భారీ వర్షాలకు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో సాయంత్రం 7 గంటల వరకూ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఇండిగో సహా పలు విమాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. సర్వీసుల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.