ప్రైవేటు బస్సు, కారు ఢీకొని పటాన్ చెరుకు చెందిన దంపతులు మృతి
రైల్వే కోడూరు దగ్గర ఘటన..
పటాన్‌చెరు, జనవరి 20 సిరి న్యూస్ః దైవ దర్శనానికి తిరుమలకు కుటుంబంతో కలిసి వెళ్ళి తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పటాన్ చెరు వాసులు మృతి చెందారు.కడప జిల్లా రైల్వే కోడూరు దగ్గర ఉదయం ట్రావెల్ బస్, కారు ఢీకొన్న ఘటనలో పటాన్ చెరు కు చెందిన దంపతులు స్పాట్ లోనే మృత్యువాత పడ్డారు.స్థానిక సమాచారం మేరకు పటాన్ చెరు నియోజకవర్గ ఉత్తర భారతీయుల సంఘం అధ్యక్షుడు సందీప్ షా(39) తన భార్య అంజలి దేవీ(33) తో పాటు ముగ్గురు పిల్లలతో మూడు రోజుల కింద దైవ దర్శనానికి తిరుమల బయలుదేరారు.ఆదివారం తిరుమల దర్శనం అనంతరం సోమవారం ఉదయం కుటుంబంతో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. రేణిగుంట-కడప జాతీయ రహదారిలో కుక్కల దొడ్డి వద్దకు రాగానే ప్రైవేట్ బస్, కారు ఢీకొనడంతో సందీప్ షా తో పాటు అతని భార్య అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతుడి పెద్ద కూతురు తీవ్ర గాయాలతో తిరుపతిలో చికిత్స పొందుతోంది. మరో ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
………..