కాంగ్రెస్ శ్రేణులు ప్రజలతో కలిసి పని చేయండి..
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించండి..
ప్రతిపక్ష పార్టీల నిజస్వరూపాన్ని ప్రజలకు వివరించండి..
టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు..
గజ్వేల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, కాంగ్రెస్ శ్రేణులు ప్రజలతో కలిసి పని చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన గజ్వేల్ మండలం జాలిగామలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు అధికారులతో సమన్వయంతో కలిసి ముందుకెళ్లాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం గుంట నక్కల్లాగా వేచి చూస్తున్నా ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి అస్త్రాలను అందివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిజాయితీ, నిబద్ధతతో, పారదర్శకంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ప్రజల కనీస అవసరాలను పట్టించుకున్న పాపాన పోలేదని, ఒక్కరికి కూడా రేషన్ కార్డును అందివ్వలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే ప్రయత్నం చేస్తుంటే బిఆర్ఎస్ నాయకులు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నిజస్వరూపాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పనికిమాలిన అవాకులు, చవాకులు పేలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తూ వివిధ పథకాలను అందిస్తూ ముందుకు వెళుతుందని ప్రజలు గ్రహించారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్ష పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి, నాయకులకు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి పంపించినా వారికి జ్ఞానోదయం కలగకపోవడం విచారకరమన్నారు. ఈ సమావేశంలో గజ్వేల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బయ్యారం మల్లారెడ్డి, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ అన్న గారి రాజిరెడ్డి, గజ్వేల్ పట్టణ సేవాదళ్ అధ్యక్షులు సయ్యద్ బాబా, ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్ము విజయకుమార్, కొండపోచమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సమీర్ ఇర్షాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ ఫరూక్ జానీ, జాలిగామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు శ్రీనివాస్, కప్ప భాస్కర్, బాలయ్య గారి రాజు గౌడ్, శేర్ల భాస్కర్, పంజాల రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.