పటాన్‌చెరు : మత్స్యకారుల సంక్షేమానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.సోమవారం ఇస్నాపూర్ మత్స్యకారులతో భేటీ సందర్భంగా వారు గత కొన్ని సంవత్సరాలుగా మత్స్యశాఖలో సభ్యత్వం మరియు కాలుష్యం వలన జీవనోపాధి సమస్యపై నీలం మధుతో చర్చించారు, ఈ విషయంపై నీలం స్పందిస్తూ కొంత కాలం ముందే ఈ సమస్యపై తాను డీఫ్ఓ,పీసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని అధికారులు పరిష్కార చర్యల దిశగా అడుగులేస్తున్నారని, ఇస్నాపూర్ గ్రామంలో నూతన సంఘం ఏర్పాటుకు సహకరించడం జరిగింది అని గుర్తుచేశారు.
నీలం మధు మాట్లాడుతూ పాశమైలారం పారిశ్రామిక వాడలో వెలువడుతున్న కాలుష్యం కారణంగా ఇస్నాపూర్,చిట్కుల్ ప్రాంతంలో చెరువులు విషపూరితంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్ధ జలాలు చెరువులో కలవడం వల్ల ఇప్పటికే ఈ ప్రాంతంలో చాలా చెరువులలో చేపల పెంపకం చేయలేకపోతున్నారు అని మరియు కొన్ని చెరువులలో చేప పిల్లలు మృత్యువాత పడుతున్నాయన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని, సంబంధిత మంత్రి కొండా సురేఖకి లేఖ ఇద్దామని తెలిపారు. ఏ ఏ పరిశ్రమల ద్వారా చెరువులకు నష్టం జరుగుతుందన్న విషయాన్ని నిగ్గు తేల్చేందుకుగాను పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రికి సంక్రాంతి తర్వాత విన్నవిద్దామన్నారు.
దానికి తోడు కొన్ని చెరువుల్లో కాలుష్యం వల్ల చేపల పెంపకనికి అనువుగా లేకపోవడంతో ఇక్కడ మత్స్యకార సభ్యులకు సొసైటీలో సభ్యత్వం కల్పించే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు. దీంతో ఇక్కడ మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలలో అర్హత సాధించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాశమైలారం పారిశ్రామికవాడలో నెలకొన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడి మత్స్యకారులను ప్రత్యేకంగా గుర్తించి జిల్లా మత్స్యకార సహకార సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని గతంలోనే తీర్మానించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని నాయకుల సహకారంతో ఈ విషయంలో ఇప్పటికే ముందడుగు వేసామని వివరించారు. త్వరలో చెరువుల కాలుష్యానికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారంతో పూర్తి సర్వే నిర్వహించి విష జలాలను విడుదల చేస్తూ చెరువుల కాలుష్యం, జీవనోపాధి లేకపోవడానికి మరియు చేపల మృతికి కారణమవుతున్న పరిశ్రమలను గుర్తించి వాటి ద్వారా మత్స్యకారులకు ప్రతి సంవత్సరం నష్టపరిహారాన్ని అందించే విధంగా పీసీబీ సిపార్సుకు కృషి చేస్తామన్నారు.
చేపల పెంపకానికి అనువు కానీ చెరువుల ప్రాంతాలలోని మత్స్యకారులను ప్రత్యేకంగా గుర్తించి ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని పథకాలకు వారిని అర్హులు చేసే విధంగా నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామన్నారు. అందరి సహకారంతో నియోజకవర్గంలో మత్స్యకారుల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నీలం మధు స్పష్టం చేశారు. మత్స్యకారుల సభ్యత్వ,జీవనోపాధి విషయంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని గ్రామస్థులు ఈ సందర్భంగా తెలియచేశారు,ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షులు మన్నేరాఘవేందర్, పెంటయ్య, నర్సింలు, వెంకటేశ్,గోపాల్,రవి,మల్లేష్,మనోహర్,శ్రీనివాస్,మల్లేశం, మణికంఠ పాల్గొన్నారు.