సంక్షేమ పథకాలు అనర్హులకు అందజేతపై ఆందోళన

Concern over giving welfare schemes to the undeserving
Concern over giving welfare schemes to the undeserving

-పథకాల మంజూరులో పారదర్శకత లేదని లబ్ధిదారుల ఆగ్రహం..
-అర్హుల జాబితాలో పేర్లు లేక అధికారుల నిలదీత..

ఝరాసంగం : గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు పథకాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలని సంకల్పించినప్పటికీ పథకాల పంపిణీ రోజున కూడా అధికారులకు చేదు అనుభవం తప్పలేదు. గ్రామ సభల్లో అధికారులపై ప్రజలు దుమ్మెత్తి పోసిన విధంగానే పథకాలను అందించే సమయంలో కూడా అధికారులకు నిలదీత తప్పలేదు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాల సాయం పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించగా ఝరాసంగం మండలంలో బర్దీపూర్ గ్రామాన్ని ఇక్కడి అధికారులు ఎంపిక చేశారు.

ఆదివారం బర్దీపూర్ లోని రైతు వేదికలో పథకాల పంపిణీ సభను నిర్వహించగా గ్రామంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అక్కడికి చేరుకున్నారు. ముందుగా అధికారులు సీఎం సందేశాన్ని దృశ్య మాలిక ద్వారా లబ్ధిదారులకు చూపించారు. అనంతరం అధికారులు రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన మంజూరీలను వివరించారు.దీనికి సంతృప్తి చెందని లబ్ధిదారులు తాము అర్హులైనప్పటికీ మంజూరీ జాబితాల్లో తమ పేర్లు లేకపోవడం పట్ల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారులు పారదర్శకత పాటించకుండా అనర్హులకు పథకాలు మంజూరు చేయడం పట్ల లబ్ధిదారులు,అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇందులో పాల్గొన్న ట్రైని కలెక్టర్ మనోజ్ లబ్ధిదారులకు నచ్చచెప్పుతున్నప్పటికీ లబ్ధిదారులు పట్టించుకోకుండా అధికారులపై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. తమకు ఖాళీ స్థలం ఉండి దరఖాస్తులు పరిశీలించినప్పటికీ ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు మంజూరు చేయలేదని లబ్ధిదారులు కలెక్టర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.అర్హులైన వారి దరఖాస్తులను పునః పరిశీలించి మంజూరు చేస్తామని,సంక్షేమ పథకాల ఎంపిక నిరంతరం కొనసాగుతుందని ట్రైనీ కలెక్టర్ లబ్ధిదారులకు వివరించడంతో ఆందోళన సద్దుమణిగింది.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి లలిత కుమారి,తహశీల్దార్ తిరుమల రావు,ఎంపీడీఓ సుధాకర్,వ్యవసాయ అధికారులు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంత్ రావ్ పాటిల్,మాజీ ఎంపీపీ దేవిదాస్,నాయకులు వేణుగోపాల్,శంకర్ పటేల్,నరేష్,శేఖర్ పటేల్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.