సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలి – అడిషనల్ కలెక్టర్ బి.చంద్రశేఖర్

డ‌బుల్ బెడ్ రూం లబ్ధిదారులందరూ కలిసిమెలిసి ఉండాలి
అన్ని వసతులను అతి త్వరలోనే కల్పిస్తాం
కొన్ని సమస్యలు మీ స్థాయిలో పరిష్కరించుకోవాలి
ప్రభుత్వం నుండి, అధికారుల నుండి పూర్తి సహకారం అందిస్తాం
– సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.చంద్రశేఖర్

రామచంద్రాపురం, జ‌న‌వ‌రి 4 సిరి న్యూస్ : సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.చంద్రశేఖర్ (Additional Collector B. Chandrasekhar) అన్నారు. శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు1, 2 లలో డబుల్ బెడ్ రూమ్ పట్టాలు పొందిన ఇండ్ల యజమానులు, సొసైటీ సభ్యులతో అన్ని శాఖల అధికారులతో జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి తో కలిసి తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో అక్కడి సమస్యల గురించి, వసతుల గురించి పరిష్కార దిశగా సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పట్టా పొందిన లబ్ధిదారులందరూ ఐకమత్యంతో కుటుంబ సభ్యులు లాగా కలిసిమెలిసి ఉండాలని, సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని చెప్పారు.

బేషజాలకు పోకుండా సానుకూల వాతావరణములో జీవనం కొనసాగించాలని, వారందరికీ దిశా నిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖల నుండి మీకు అందవలసిన అన్ని వసతులను అతి త్వరలోనే కల్పించడం జరుగుతుందని తెలిపారు. సొసైటీలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోగానే షాపుల అలాట్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇంటి యజమానులందరూ కొన్ని సమస్యలు మీ స్థాయిలో పరిష్కరించుకుంటే అంతకు రెట్టింపు స్థాయిలో ప్రభుత్వం నుండి, అధికారుల నుండి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి సమిష్టిగా అందరూ కృషి చేయాలని కోరారు.

అక్కడి నుండి అన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, ఇంటి నెంబర్ల కేటాయింపు, విద్యుత్తు, నీటి సౌకర్యం, డ్రైనేజీ సమస్యలు, పారిశుధ్య సమస్యలు, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, త్వరలోనే ఏర్పాటుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సమావేశానికి ముందు జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మున్సిపల్ సాధారణ నిధుల నుండి నిర్మింపబడుతున్న ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను, బీటీ రోడ్, స్త్రీ శక్తి మహిళా క్యాంటీన్ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

త్వరలోనే ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డికి సూచించారు. ఈ సమన్వయ సమావేశంలో తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, తహశీల్దార్ సంగ్రామ్ రెడ్డి, మున్సిపల్ డీఈఈ సత్యనారాయణ, ఎఈఈ మౌనిక, సీడీపీఓ జయరాం నాయక్, ఆర్ఓ వెంకటరామయ్య, మేనేజర్ అఖిల్, జీహెచ్ఎంసీ ఏఈ సత్యనారాయణ, సైట్ ఇంజనీర్ ప్రణీత్, అంగన్వాడి సూపర్వైజర్ జ్యోతి, మున్సిపల్ సిబ్బంది, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.