బ్రతుకు భారం – బస్టాండే శరణ్యం

చిన్నశంకరంపేట, జనవరి 7, ( సిరి న్యూస్) బ్రతుకేమో భారంగా సాగుతుంది. జీవించడం కష్టంగా మారింది. అందరూ ఉన్న ఒంటరిగా ఉంటూ ఆ దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్దామా అని ఆలోచిస్తూ బ్రతుకును భారంగా నెట్టుకొస్తుంది ఆ వృద్ధురాలు. చిన్న శంకరంపేట మండల పరిధి ఖాజాపూర్ గ్రామానికి చెందిన బాల పోచమ్మకు చిన్నతనంలోనే పోచయ్యతో వివాహం జరిగింది. తన కొడుకు పోచయ్య చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. ఆమె తన భర్త పేరుని కుమారునికి పెట్టుకొని అన్ని తానై జీవించింది. బాల పోచమ్మ రోజు కూలి పనికి చేస్తూ, కూలి పని దొరకనప్పుడు భిక్షాటన చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేది. కుమారుడు పోచయ్యకు సత్యం-మాన మహిళతో వివాహం చేసింది. ఉన్న కొద్దిపాటి స్థలంలో గుడిసె వేసుకొని ఒకవైపు కుమారుని కుటుంబం ఇంకోవైపు బాలపోచమ్మ నివాసం ఉండేవారు. పోచయ్యకు ఇద్దరు కుమారులు బాబు కుమారులు పుట్టడంతో వారిని చూసుకుంటూ కాలం వెలదీస్తూ వచ్చింది.

ఇంతలో విధి పగబట్టింది. కుమారుడు పోచయ్య కాలుకు దెబ్బ తగలగా హాస్పిటల్లో చూపించారు. షుగర్ వ్యాధి సోకిందని కాళ్లు మొత్తం చెడిపోయిందని కాలు తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదం అని తెలుపడంతో కాలును తొలగించారు. కుమారుడు మంచానికే పరిమితం కావడంతో కుటుంబ భారం బాల పోచమ్మ భార్య సత్తెమ్మ లపై పడింది. వారు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చిన్న మనుమడు కుమార్ వృద్ధులైన తల్లిదండ్రులను నాయనమ్మను వదిలేసి ఇంటి నుండి వెళ్లిపోయాడు. పెద్ద మనుమడు బాబు నాయనమ్మ పోచమ్మను చూసుకుంటూ ఉండేవాడు.

కొన్ని రోజుల క్రితం బాబు రోడ్డు ప్రమాదంలో గాయపడి కాళ్లు విరిగిపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఉన్న చిన్నపాటి గుడిసెలో కాలు పోయిన కుమారుడు మనుమడు బాబులు మాత్రమే ఉండటానికి వీలుంది. చేసేది లేక బాల పోచమ్మ స్థానికంగా ఉన్న బస్టాండ్లో నివసిస్తూ కాలం వెళ్లదీస్తుంది. అంగవైకల్యంలో ఉన్న కుమారుడు పోచయ్యకు తనకు పింఛన్ రాకపోవడంతో బ్రతకడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆమె ఆవేదనతో తెలిపింది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆ వృద్ధురాలు కోరింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నామని, ఉండటానికి చిన్నప్పటి గుడిసె తప్ప ఏమీ లేదని అధికారులు దయతలచి ఆదుకోవాలని ఆమె కోరుతుంది. తనకు తన కుమారుడికి పింఛన్ మంజూరు చేయాలని ఆమె రోదిస్తూ కోరింది.