అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి

– సిద్దిపేట అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌

సిద్దిపేట కలెక్టరేట్‌ : రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సిద్దిపేట అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రహదారుల వెంట స్పీడ్‌బ్రేకర్లు, చెట్లపొదలు లేకుండా తొలిగించాలన్నారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, మైనర్‌ డ్రైవింగ్‌లపై కఠినంగా వ్యవహరించడంతో పాటు కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో వాహనాలు ఆపకుండా ఆర్టీసీ, పోలీస్‌ సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నిర్వహించే బెల్ట్‌ షాపులపై చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల్లో డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ డీఈఈ మనోహర్‌, ఏసీపీ మధు, జిల్లా వైద్యాధికారి పల్వన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.