ఆర్థిక ఇబ్బందులతో యువరైతు ఆత్మహత్య

గజ్వేల్ ఫిబ్రవరి 6(సిరి న్యూస్): ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ చెట్టుకు ఉరి వేసుకుని ఓ దళిత యువ రైతు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ధార నాగరాజు (38 ) తనకున్న 30 గుంటల వ్యవసాయ భూమీలో పంటలు పండిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

ఉన్నకొద్ది భూమిలో పంట సరిగా రావడం గగనమైంది. ఈ మధ్యనే అప్పు తెచ్చి నూతన గృహ నిర్మాణం చేశాడు. ఇంటి నిర్మాణం, వ్యవసాయ అవసరాలకు తెచ్చిన అప్పులు తలకు మించిన భారంగా మారింది. రెక్కల కష్టం మీద కుటుంబం నడవడం తలకు మించిన భారంగా మారడంతో ఇక అప్పులు తీర్చే మార్గం కనుచూపుమేరలో లేకపోవడంతో తీవ్ర మనఃస్థాపానికి లోనయ్యాడు. ఏం చేయాలో తెలియక కొండంత బాధను దిగమింగుకుంటూ బుధవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో తన వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని తనువు చాలించాడు. మృతుడు నాగరాజుకు తల్లి పెంటమ్మ తో పాటు భార్య రాజమణి, ఇద్దరు కుమారులు కళ్యాణ్ ( 15 ), రాజు ( 12 ) ఉన్నారు. మృతుడు నాగరాజు ది నిరుపేద కుటుంబం అయినందున ప్రభుత్వ పరంగా కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.