పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఓ అపూర్వ కలయిక, పూర్వ విద్యార్థులు
గజ్వేల్ : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో విద్యనభ్యసించిన 2000-2001 సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇప్పలగూడెంలోని ఓ గెస్ట్ హౌస్ లో ఆదివారం గణతంత్ర దినోత్సవం రోజు ఆనందోత్సాహాల మధ్య జరిగింది. పదవ తరగతి పూర్తి చేసుకుని 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అపూర్వ కలయికలా అందరూ అసూయ పడేలా జరుపుకున్నారు. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్న రోజులు, ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఆడి పాడి అలసి సొలసిన చిన్ననాటి చిలిపి చేష్టల బాల్య జీవిత గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కొన్ని గంటల పాటు ఆ పాత మధుర జ్ఞాపకాల స్మృతులను గుర్తుకు తెచ్చుకుని ఆనంద డోలికల్లో తేలియాడారు.
ముఖ్యంగా ఆనాటి ఉపాద్యాయులు, వారి బోధనా శైలిని గుర్తుకు తెచ్చుకుని కృతజ్ఞతలు తెలుపుకున్నారు. పదవతరగతి వరకు చదువుకున్న అప్పటి స్నేహితులు వారు చేసిన అల్లరి పనులు, చదువుల్లో, ఆటపాటల్లో పోటీ పడి చదివిన, ఆడి పాడిన రోజులను గుర్తు చేసుకుని సంతోషంతో కేరింతలు కొట్టారు. 25 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థినీ విద్యార్థులు స్నేహితులు అందరూ ఒకేచోట కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమకు నచ్చిన హావభావాలతో గ్రూపు ఫోటోలకు ఫోజులిచ్చి అందరూ కలిసి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.
అనంతరం అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న రుచికరమైన భోజనాలు చేసి కొంతసేపు అలా స్నేహితులతో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ సేదతీరారు. ఈ కార్యక్రమంలో సభ్యులైన సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు నాయకులు రమేష్ దాచారం, పాత్రికేయులు పొట్ట అశోక్ కుమార్, ఇప్పలగూడెం మాజీ సర్పంచ్ భర్త చాడ సుధాకర్ రెడ్డి, తాడూరి వెంకటేష్, తాడూరి దుర్గా ప్రసాద్, గొల్లపల్లి సంతోష్ కుమార్, సిలివేరి స్వామి, మంగి స్వామి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, చంద్రారెడ్డి, బంగారు రెడ్డి, పరమేశ్వర రెడ్డి, నర్సింలు, శ్రీనివాస్, బాబు, సాధుల్లా, భాస్కర్, బైండ్ల రమేష్, పూర్వ విద్యార్థినిలు సంతోషి, రజిని, రాధిక, రేఖ, స్వప్న, రేణుక, యాదమ్మ, కనకరాణి, రాజేశ్వరి, లలిత, కనకజ్యోతి, కళావతి, లావణ్య, పూలమ్మ, కనకలత, స్వరూపరాణి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.