వెయ్యి మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కేంద్రాలు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

స్వయం సహాయక సంఘాల ద్వారా
వెయ్యి మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కేంద్రాలు
మ‌హిళా సాధికార‌తే ప్ర‌భుత్వ ల‌క్ష్యం
వీడియో కాన్ఫ‌రెన్స్‌లో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి సీత‌క్క‌
ప్రాజెక్టు కోసం వంద ఎక‌రాల భూమి గుర్తింపు
త్వ‌ర‌లో నివేదిక‌లు అందిస్తాం మెద‌క్ క‌లెక్ట‌ర్ రాహుల్ రాజ్‌

మెద‌క్‌/ సంగారెడ్డి, జ‌న‌వ‌రి 8(సిరిన్యూస్‌) :

మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటు ప్రగతిపై బుధవారం ప్రజాభవన్ నుండి రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి, పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి లోకేష్ కుమార్, సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్, ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్, విద్యుత్ శాఖల సిఎండిలతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటుచేసి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటికే ఇంధన శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖలతో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిల్లాల వారీగా భూమి సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

మహిళలు ఆర్థిక సాధికారత సాధనతో పాటు ఆర్థికాభివృద్ధికి అవకాశాలు కల్పించాలని తెలిపారు. నూతన విద్యుత్ పాలసీ, ఇంధన, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య గత సంవత్సరం నవంబర్ 19న కుదిరిన ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. 5 సంవత్సరాల కాలంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో మహిళలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని అన్నారు. పెద్ద మొత్తంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్న క్రమంలో వారు వివిధ రకాల వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మహిళా సంఘాలు సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ వరకు కనీసం ప్రతి జిల్లాలో 150 ఎకరాలు గుర్తించి నివేదికలు అందించాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ, రెడ్కో ద్వారా త్వరలో టెండర్లు పూర్తి చేసి ఖరారు చేస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో సంఘాలను గుర్తించి నిర్ధారించడం, భూ సేకరణ, బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం వంటి పనులను గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు త్వరితగతిన పూర్తి చేయు విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో నర్సాపూర్లో దేవస్థానం భూమి 100 ఎకరాలు గుర్తించినట్లు తెలిపారు. జిల్లాల లక్ష్యాలకు అనుగుణంగా ఇంకో 50 ఎకరాల భూమిని నిర్దేశించిన గడువులోగా పూర్తిస్థాయిలో గుర్తించి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి తద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు, జిల్లాలో టోటల్ సబ్ స్టేషన్స్ 75 ఉన్నాయని సర్వే నెంబర్ల వారీగా నివేదికలు అందజేసే విధంగా టీజీఎస్పీడీసీఎల్ అధికారులు సూచించినట్టు చెప్పారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ జోజి, డిఆర్డిఓ పీడి శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి శశికళ, టీజీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఏ.శంకర్, డీఈ చాంద్ షరీఫ్ పాషా, ఏడీ మోహన్ ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా నుండి క‌లెక్టర్ క్రాంతి వల్లూరు, డీఆర్డీఓ జ్యోతి, జిల్లా సాంఘీక సంక్షేమాధికారి అఖేలేష్ రెడ్డి , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.