ఇస్నాపూర్, జూన్ 30 (సిరి న్యూస్): పటాన్‌చెరు మండలం మైలారం దారిలో ఉన్న ఐడీపీ ప్రాంతంలోని శిగాచీ ప్రైవేట్ కెమికల్ కంపెనీలో ఈ రోజు ఉదయం రియాక్టర్ పేలుడు సంభవించింది. ప్రమాదం సంభవించిన సమయంలో కంపెనీలో సుమారు 50 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడినట్టు ప్రాథమిక సమాచారం. అగ్ని ప్రభావానికి గురైన ఉద్యోగులను అంబులెన్సుల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశ్రమ పరిసరాలలో పొగలు వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. శబ్దంతో భయంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. షిఫ్ట్‌లో ఉన్న కార్మికులంతా సురక్షితంగా బయటపడారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.