ఐఎంఎస్ అవకతవకల పై చర్యలకు డిమాండ్  

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 27 (సిరి న్యూస్):  ఐఎంఎస్ ఫ్యామిలీ వెల్ఫేర్ జేడీ, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కలసి చేసిన అవకతవకల పై తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ – ఈఎస్ఐ వారు అభ్యర్థించిన విషయాన్ని తెలంగాణ బిసి సంక్షేమ సమితి, రాష్ట్ర అధ్యక్షుడు, పెరుమాండ్ల కిషోర్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పెరుమాండ్ల కిషోర్ శుక్రవారం నాడు సంగారెడ్డి ఐబి ప్రాంగణంలో బీసీ జన సంక్షేమ కార్యక్రమాలలో’ పాల్గొన్న క్రమంలో అక్కడ అందుబాటులో వున్న పాత్రికేయులతో కలసి ముచ్చటించారు. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ – ఈఎస్ఐ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు కలసి 08 ఆగస్టు 2025  నాడు ప్రిన్సిపాల్ సెక్రటరీ మినిస్టర్ అఫ్ లేబర్, ఎంప్లొయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్, తెలంగాణ ప్రభుత్వం వారికి అభ్యర్థన పత్రం అందజేసిన విషయం తెలియజేశారు. ఐఎంఎస్ విభాగంలో తీవ్రమైన అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగ సంఘాలు, వైద్యులు, కార్మిక సంఘాల ఆరోపణల ప్రకారం (జేడీ, ఫ్యామిలీ వెల్ఫేర్) తో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇద్దరూ కలసి నిధుల దుర్వినియోగం, పదోన్నతులు, బదిలీలలో లోపాలు, ఆర్‌టిఐ దరఖాస్తులను నిర్లక్ష్యం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డ ఆరోపణలను వారు గుర్తు చేశారు. ప్రభుత్వం జి.ఓ.నెం.379 (06 ఆగస్టు 2019) ప్రకారం రాష్ట్రంలోని ఐఎంఎస్ సంస్థల కొనుగోలు, సరఫరాలు, చెల్లింపులు, ధన్వంతరి పథకం, బయోమెట్రిక్ హాజరు పర్యవేక్షణ కోసం నియమించిన నోడల్ అధికారులను కూడా ఐఎంఎస్ ఫ్యామిలీ వెల్ఫేర్ జేడీ మార్చి 2025లో బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఏకపక్షంగా తొలగించినట్లు వచ్చిన ఆరోపణల పై తగిన చర్యలు తీసుకుంటారని వారు ఆశించారు.

దీని వలన ఆసుపత్రులు, డిస్పెన్సరీల పనితీరు దెబ్బతిన్నదని, లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయని అన్నారు.  ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని, ఇద్దరు అధికారులను పదవులనుండి తప్పించి, నిష్పాక్షిక విచారణ జరపాలని సంఘాలు డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తావించిన ఈ అవకతవకలపై తాను సైతం సంబంధిత కార్మిక శాఖ మంత్రి, వివేక్  వెంకటస్వామి కు తేదీ. 23 సెప్టెంబరు 2025  నాడు పిర్యాదు చేసానని తెలియజేస్తూ, బాధితులకు న్యాయం జరగాలని ఆశాభావం వ్యక్తం చేసారు. బాధితులకు న్యాయం జరగని సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చెపటుతామని తెలంగాణ బిసి సంక్షేమ సమితి, రాష్ట్ర అధ్యక్షుడు, పెరుమాండ్ల కిషోర్ ప్రభుత్వానికి ఘాటుగా హెచ్చరించారు.